తన గుడిసె ఎదుట మంచంపై నిద్రిస్తున్న ఓ వికలాంగుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.
- కలకలం రేపిన ఘటన
- పరిశీలించిన డీఎస్పీ
అడ్డాకుల : తన గుడిసె ఎదుట మంచంపై నిద్రిస్తున్న ఓ వికలాంగుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం... అడ్డాకులకు చెందిన గొల్ల ఈర్ల నాగన్న (39) పుట్టుకతో వికలాంగుడు. పదిహేనేళ్ల క్రితం వనపర్తికి చెందిన లక్ష్మితో వివాహం కాగా రెండేళ్లలోపే వదిలేశాడు. అనంతరం కొత్తకోటకు చెందిన కొండమ్మను పెళ్లి చేసుకున్నా ఆమెనూ విడిచి పెట్టాడు. ఈయనకు కొంత పొలం ఉండగా సుమారు పన్నెండేళ్ల నుంచి ఒంటరిగా జూనియర్ కాలేజీ పక్కన గుడిసె వేసుకుని సారా విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఆరుబయట మంచంపై నిద్రిస్తున్న అతడిని గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో పాశవికంగా హత్య చేసి పారిపోయారు.
బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు ఇది గమనించి వెంటనే వీఆర్‌ఓ బాలస్వామితో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని వనపర్తి డీఎస్పీ కంచి శ్రీనివాసరావు, కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్‌ఐ మురళీగౌడ్, అడ్డాకుల ఏఎస్‌ఐ మహ్మద్ ఇక్బాల్‌అహ్మద్ పరిశీలించారు. అక్కడ రెండు బీరు సీసాలు, క్వార్టర్ బాటిల్ ఉన్నాయి.
జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. గుడిసె నుంచి హైవే వైపు కొద్దిదూరం వెళ్లి అది తిరిగొచ్చింది. అలాగే క్లూస్‌టీం ఏఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ సిబ్బందితో కలిసి వేలిముద్రలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, ఈ హత్యకు వివాహేతర సంబంధాలు లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.