ఘోరం.. | Harassment, lost in financial problems | Sakshi
Sakshi News home page

ఘోరం..

Published Mon, Jun 23 2014 11:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

ఘోరం.. - Sakshi

ఘోరం..

వేధింపులు, ఆర్థిక ఇబ్బందులకు బలైన తల్లీకొడుకులు
కుమారుడిని నడుముకు కట్టుకొని బావిలోదూకి ఆత్మహత్య
మృతదేహాలు తరలించకుండా అడ్డుకున్న బంధువులు
శంషాబాద్ మండలం  మదన్‌పల్లి పాతతండాలో విషాదం   
పోలీసుల అదుపులోఅత్తామామలు
 

శంషాబాద్ రూరల్:
కట్టుకున్నోడు కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిసయ్యాడు.. దీంతో ఆమె కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని రెక్కలుముక్కలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త, అత్తామామల వేధింపులు ఎక్కువయ్యాయి. తను చనిపోతే లోకం పోకడ కూడా తెలియని చిన్న కొడుకు పరిస్థితి ఏంటి..? అని ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయినట్టుంది. కుమారుడిని చీరతో నడుముకు కట్టుకొని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అందరి మనసులను కలచివేసే ఈ ఘటన శంషాబాద్ మండలం మదన్‌పల్లి పాతతండాలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మదన్‌పల్లిపాతతండా నివాసి రమావత్ రవి 15 ఏళ్ల క్రితం రాజేంద్రనగర్  సర్కిల్ గగన్‌పహాడ్‌కు చెందిన నీల(30)ను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారులు దీక్షిత్(9), శ్రీహరి(5) ఉన్నారు. పెద్దకొడుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శ్రీహరి తల్లివద్దే ఉంటున్నాడు. రవి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో నీల కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఇటీవల కాలంలో భర్త, అత్తమామల వేధింపులు తీవ్రమయ్యాయి. తీవ్ర మనో వేదనకు గురైన ఆమె ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో తన చిన్న కొడుకు శ్రీహరిని తీసుకొని కట్టెల కోసమని వెళ్లి తిరిగి రాలేదు. తండా సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఓరియంటల్ గార్డెన్‌లో స్థానికులు కట్టెలు సేకరిస్తుంటారు. భార్యాపిల్లలు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో రవి ఓరియంటల్ గార్డెన్‌లోకి వెళ్లి వారి కోసం వెతికాడు. అక్కడ ఓ బావి వద్ద నీలకు సంబంధించిన టవల్ కనిపించింది. భార్యాపిల్లల కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో రవి టవల్ తీసుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి కూడా తల్లీపిల్లలు ఇంటికి చేరుకోకపోవడంతో రవి విషయం ఇరుగుపొరుగు వారికి చెప్పాడు.

బావిలో శవాలై తేలారు..

సోమవారం ఉదయం స్థానికులు, కుటుంబీకులు బావి వద్దకు చేరుకున్నారు. బావిలోని నీళ్లపై పూర్తిగా నాచు ఉండడంతో ఇద్దరు యువకులు లోపలికి దూకారు. నాచును పక్కకు తప్పించి చూడగా నీల, హరి మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. నీల తన కొడుకును చీర కొంగుతో నడుముకు కట్టుకొని ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలోంచి వెలికితీయించారు. అప్పటి వరకు అక్కడే ఉన్న మృతురాలి భర్త, అత్తింటివారు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. భర్త, అత్తమామల వేధింపులే తల్లీకొడుకుల ఉసురు తీశాయని నీల బంధువులు ఆరోపించారు. రవి, అతడి తల్లిదండ్రులను ఇక్కడికి తీసుకొచ్చేవరకు మృతదేహాలను తీయనీయబోమని బంధువులు పోలీసులను అడ్డుకున్నారు.ఆందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పారు. స్థానిక క్లస్టర్ ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. తండాలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రవితోపాటు అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement