పాత నమూనాలోనే ప్రాణహిత కాల్వలు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గతంలో నిర్ధారించిన నమూనాలోనే ప్రాణహిత ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులు కొనసాగించాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణ డిజైన్లను మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించి త్వరితగతిన అనుమతులు పొందాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో అధికారులతో హరీశ్ సమీక్ష నిర్వహించారు. ప్రాణహితకాల్వ 78వ కి.మీ. నుంచి సుందిళ్ల బ్యారేజీకి టేకుమట్ల వాగు ద్వారా నీటిని గ్రావిటీతో తరలించేందుకు సర్వే జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి కొండపోచమ్మ జలాశయం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే చెల్లించి పనులకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రధాన కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ సంస్థలకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి ప్రతి వారం సమీక్ష జరపాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్షిస్తూ గోదావరి నుంచి కిన్నెరసాని, ముర్రేడు వాగు వరకు ప్రాజెక్టు పనులకు ఈ నెలాఖరు దాకా టెండర్లు పిలవాలని ఆదేశించారు. భక్తరామదాసు ప్రాజెక్టు పనులను, శ్రీరాంసాగర్ రెండో దశ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.