కాంగ్రెస్‌వి దివాలాకోరు రాజకీయాలు
⇒ గవర్నర్ ప్రసంగంపై పీసీసీ నోట్ చిత్తు కాగితం: హరీశ్
⇒ ఆ పార్టీ నేతలది దిగజారుడుతనం, అవగాహనా రాహిత్యం
⇒ అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తన గుడ్డి వ్యతిరేక తను బయట పెట్టుకుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాలతో ఉందంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విడుదలచేసిన నోట్ ఒక చిత్తు కాగితమన్నారు. కాంగ్రెస్ దిగజారుడు, దివాలాకోరు రాజకీ యాలకు, అవగాహనా రాహిత్యానికి అది నిదర్శనమన్నారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌వద్ద హరీశ్ మాట్లాడారు. ఉత్తమ్ విడుదల చేసిన 40 పేజీల నోట్‌లో ఒక్క పేజీ కూడా పనికిరాద ని, ఒక్క వాక్యంలో కూడా వాస్తవం లేదన్నారు. పూర్తి అవాస్తవాలతో నోట్ ఇచ్చి ప్రజలను తప్పుదో వ పట్టించేందుకు ప్రయత్నించారన్నారు. జీఎస్‌డీపీని కేంద్రానికి చెందిన గణాంక శాఖ ఖరారు చేస్తుందని, ఈ విషయం కూడా ఉత్తమ్‌కు తెలియకపోవడం అవివేకమన్నారు. జాతీయ సగటుకన్నా తెలంగాణ ఎక్కువ వృద్ధి రేటు సాధించిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతల తీరు హాస్యాస్పదం
పెట్టుబడుల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంద ని గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు పెరి గిన వైనాన్ని పారదర్శక, సుపరిపాలన గురిం చి ప్రస్తావించారని హరీశ్ తెలిపారు. కానీ తెలంగాణ నంబర్ వన్ అని గవర్నర్ ప్రసం గించినట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తమ ప్రభుత్వం రికార్డు సృష్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కనీసం 6 గంటలు కూడా విద్యుత్ సరఫరా చెయ్యలేద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమున్న కర్ణాటకలో కరెంట్ కోతలపై ఆ పార్టీ నేతలు జవాబి వ్వాలని హరీశ్ డిమాండ్ చేశారు.
ఆస్పత్రులకు వెళ్లి పరిశీలించుకోండి
హెల్త్ కార్డుల ద్వారా లక్షా 6వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందాయని.. గత మూడు నెలల్లోనే 4,100మంది వైద్య సేవలు పొందారని హరీశ్ చెప్పారు. కానీ హెల్త్ కార్డుల ద్వారా ఒక్కరికై నా వైద్యసేవలు అందలేదంటూ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని.. దమ్ముంటే కిమ్స్, యశోద, కేర్ వంటి ఆసుపత్రులకు వెళ్లి పరిశీలించవచ్చని సవాలు విసిరారు. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్ల విద్యార్థులకు వందల కోట్లు వెచ్చించి సన్నబియ్యం అంది స్తున్నామని తెలిపారు.
మిషన్ కాకతీయ, భగీరథ వంటి చరిత్రాత్మక కార్యక్రమాల్లో అబద్ధాలేమున్నాయని ప్రశ్నించారు. కరువు, వలసలకు కేరాఫ్‌గా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామన్నారు. కాంగ్రెస్ నాయకు లకు దమ్ముంటే మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ దామని సవాల్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అవుతు న్నారని.. లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా చెక్కులు సైతం అందజేస్తున్నారని తెలిపారు.
ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తాం..
గతేడాది ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు జరిగినా.. భూసేకరణ, పునరావాసం విషయంలో కాంగ్రెస్ నేతలు సృష్టించిన అడ్డంకులు, కోర్టు కేసుల కారణంగా జాప్యమవుతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని, ఇకపై ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను చాలా వరకు ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని చెప్పారు.
మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 17 వేల చెరువుల పునరుద్ధరణ పూర్తయిందని, వాటి కింద 7.5 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగవుతోందని తెలిపారు. ఈ ఏడాది మరో 7 వేల చెరువులను పునరుద్ధరించనున్నామని వెల్లడించారు. కేంద్ర పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏదేమైనా కోటి ఎకరాలకు నీళ్లిచ్చి బంగారు తెలంగాణ చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.