
శనివారం ట్రస్మా ఎడ్యుకేషన్ ఎక్స్‌పోను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు నాణ్యమైన విద్యనందించడం ఎంత అవసరమో, విలువలతో కూడిన విద్యను అందించడం కూడా అంతే అవసరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యం లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఎడ్యుకేషన్ ఎక్స్ పో–2019ను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరమో ట్రస్మా చాటిచెప్పిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, ప్లాస్టిక్ రహిత సమాజం పట్ల అవగాహన, మొక్కల పెంపకం, సమయ పాలన నేర్పాలని వీటిని విద్యాలయాల నుంచే పిల్లలకు దేశ చట్టాలు, విలువలు నేర్పించాలన్నారు.
సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి
పేదల గృహాలకు డెవలపర్లు సహకరించాలి
రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో ప్రైవేట్ డెవలపర్లూ భాగస్వాములు కావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. పేదలకు సొంతింటి కలను తీర్చడాన్ని ప్రైవేట్ బిల్డర్లు సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్మించే పేదల గృహాలను వేగంగా పూర్తి చేయడంలో సహకరించాలని కోరారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన 2వ క్రియేట్ అవార్డ్స్–2019 ప్రదానోత్సవంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. విద్యుత్, నీటి వినియోగం ఎక్కువగా అవసరం లేని గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణాలపై డెవలపర్లు దృష్టి సారించాలన్నారు.