అభివృద్ధే మంత్రం | Harish Rao Interview With Sakshi Medak | Sakshi

అభివృద్ధే మంత్రం

Oct 20 2018 1:16 PM | Updated on Oct 20 2018 1:16 PM

Harish Rao Interview With Sakshi Medak

‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లలో మేం అభివృద్ధిని చేసి చూపాం. మళ్లీ అధికారం ఇస్తే ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేసేందుకు కంకణబద్ధులమై పనిచేస్తాం. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను సాధించి తీరుతాం. ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం లేని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడినా సాధించేదేమీ ఉండదు. అవకాశవాద రాజకీయ కూటమికి ప్రజలే తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తారు.’ ఇదీ ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు మనోగతం. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎన్నికల సమరాంగణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులను అంతా తానై నడిపిస్తున్న హరీశ్‌రావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర శాసన సభ రద్దు చేసి సరిగ్గా నెలన్నర కావస్తోంది. మరో నెలన్నరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
హరీశ్‌: సెప్టెంబర్‌ 6న రాష్ట్ర శాసన సభను రద్దు చేసిన వెంటనే ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో జహీరాబాద్‌ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. అందోలు మినహా మిగతా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే, తిరిగి పార్టీ అభ్యర్థులుగా మరోమారు బరిలోకి దిగారు. సీఎం కేసీఆర్‌ మరోసారి గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కొన్ని కారణాలతో అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది.

  • సాక్షి: డిసెంబర్‌ మొదటి వారంలో పోలింగ్‌ జరగనుంది. మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. మీరు ప్రచారంలో మునిగి తేలుతున్నారు?
  • హరీశ్‌: నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఎన్నికల తేదీతో సంబంధం లేకుండా, అసెంబ్లీ రద్దు ఆ వెంటనే అభ్యర్థులను ప్రకటించాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దాదాపు తొలి విడత ప్రచారం పూర్తయింది. కార్యకర్తల సమావేశాలు, ర్యాలీలు, గ్రామాల వారీగా సమావేశాలు.. వెళ్లిన ప్రతీ చోటా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నేను కూడా మెదక్‌ మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఇప్పటికే ఒక విడత చుట్టి వచ్చా. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు.
  • సాక్షి: మీరు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతున్న ఎజెండా ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు?
  • హరీశ్‌: గత ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను దాదాపు ఆచరణలోకి తీసుకు వచ్చాం. మేనిఫెస్టోలో లేని అనేక అంశాలను కూడా ప్రజలకు మేలు చేకూర్చే రీతిలో ప్రణాళిక రూపొందించి అమలు చేశాం. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కంటి వెలుగు.. ఇలా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టోలో లేని అంశాలను చాలా అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుంది. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు వంటి విప్లవాత్మకమైన పథకాలు మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేశాం. దీంతో పాటు నియోజకవర్గాల్లో స్థానికంగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపించాం.
  • సాక్షి: ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో అభివృద్ధి కేవలం గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు పరిమితమైందనే విమర్శ ఉంది?
  • హరీశ్‌: ఇది పూర్తిగా సత్యదూరమైన విమర్శ. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమ ప్రాధాన్యతతోనే అభివృద్ధి సాధించాం. మనోహరాబాద్‌–కొత్తపల్లి, మెదక్‌ అక్కన్నపేట రైలు మార్గంతో పాటు సంగారెడ్డి–నాందేడ్‌ 161, మెదక్‌–ఎల్కతుర్తి, ప్రాంతీయ రింగు రోడ్డు వంటి జాతీయ రహదారులు టీఆర్‌ఎస్‌ పాలనలో సాకారమయ్యాయి. కాలువల ద్వారా సింగూరు జలాలు, ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే సాధ్యమయ్యాయి. ఇక వివిధ ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
  • సాక్షి: వచ్చే ఎన్నికల్లో మహా కూటమి ప్రభావం జిల్లాలో ఎంత మేర ఉంటుంది?
  • హరీశ్‌: ఏనాడు ప్రజల బాగోగుల గురించి పట్టించుకోని కాంగ్రెస్‌ నేతలు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహా కూటమి పేరిట అనైతిక పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణకు ఫక్తు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంలోనే కాంగ్రెస్‌ డొల్లతనం బయట పడుతోంది. చంద్రబాబు నాయకత్వాన్ని పరోక్షంగా తెలంగాణ ప్రజల మీద రుద్దేందుకు కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. జిల్లాలో కాంగ్రెస్‌ బలమేంటో 2016 నారాయణఖేడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితంతో తేలిపోయింది. ఎంత మందితో కలిసి ఎన్ని కూటములు ఏర్పడినా జిల్లాలో వారి ప్రభావం శూన్యం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పదికి అసెంబ్లీ స్థానాలూ మావే.
  • సాక్షి: టికెట్ల కేటాయింపు తర్వాత పార్టీలో అక్కడక్కడా అసంతృప్తి ఉన్నట్లుంది?
  • హరీశ్‌: పార్టీలో ఉన్న అందరికీ రాజకీయంగా అవకాశాలు రాకపోవచ్చు. వారి సేవలను గుర్తించి ఏదో ఒక రూపంలో సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. అవకాశం రాని కొందరు అక్కడక్కడా ఆవేదనతో ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు. 
  • పార్టీ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఒకరిద్దరు బయటకు వెళ్తే వెళ్లొచ్చు. మెజారిటీ నాయకులు, కార్యకర్తలు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. జిల్లాలో పార్టీ ఏకతాటిపై అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
  • సాక్షి: సిద్దిపేట, గజ్వేల్‌లో ఏమైనా ప్రత్యేక ప్రచార వ్యూహం ఉందా?
  • హరీశ్‌: సీఎం స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గజ్వేల్‌ నియోజకవర్గంలో వందేండ్ల అభివృద్ధి కేవలం నాలుగేండ్లలో సాధ్యమైంది. ఉద్యమ కేంద్రంగా ఉన్న సిద్దిపేట అభివృద్ధిలోనూ మేటిగా ఉంది. ఈసారి సిద్దిపేటలో లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తామనే మాట ఓటర్ల నుంచే వినిపిస్తోంది. ప్రజల ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే.
  • సాక్షి: ఎన్నికల్లో ఏదైనా ప్రత్యేక నినాదంతో వెళ్లే ఆలోచన ఉందా?
  • హరీశ్‌: టీఆర్‌ఎస్‌ చెప్పేదే చేస్తుంది. ఉద్యమ పార్టీగా ప్రజలకు ఏది అవసరమో మాకంటే ఎక్కువ ఇతరులకు ఎవరికీ తెలియదు. డబుల బెడ్‌రూం, దళితులకు భూ పంపిణీ అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా, కొన్ని సాంకేతిక కారణాలతో అనుకున్న వేగంతో ముందుకు సాగలేదు. మేం ఇటీవల ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోకు మంచి స్పందన లభిస్తోంది. ఒకటి మాత్రం చెప్పదల్చుకున్నాం. ‘ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి’. ప్రజలకు ఎళ్లవేలలా అందుబాటులో ఉంటాం. ఆశీర్వదించడని కోరుతున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement