‘మిషన్ కాకతీయ’
ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’తో ప్రజలకు అనుభవమయ్యేలా సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అధికారులను కోరారు. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పనులు పారదర్శకంగా జరగాలని, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలని సూచించారు. ఎస్‌ఈలు, ఈఈలు, ప్రతిరోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని, వాటి పురోగతిపై ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆదేశించారు. ఫీడర్ చానల్స్ ఆక్రమణల తొలగింపులో సమస్యలు ఉత్పన్నమైతే జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి వారం తాను కూడా వివిధ జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. ఈనెల 4న మహబూబ్‌నగర్, 5న మెదక్, 11న వరంగల్ జిల్లాల్లో పర్యటించి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తానన్నారు. వ్యవసాయ శాఖ మొబైల్ లేబొరేటరీల ద్వారా పూడిక మట్టి సారాన్ని పరీక్షించి, ఫలితాలను పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. సమీక్షలో భాగంగా మిషన్ కాకతీయకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు.
వికేంద్రీకరించిన విధంగానే టెండర్లు వేసే (క్లాస్ 4, 5) కాంట్రాక్టర్ల అర్హతను రూ.10 లక్షల నుంచి రూ.50 ల క్షలకు పెంచాలని ఉన్నతాధికారులు కోరగా, ఈ విషయమై ప్రభుత్వానికి వెంటనే ఫైల్ పంపాల్సిందిగా ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను మంత్రి ఆదేశించారు.
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని రూ.50 లక్షలకు పెంచాలన్నారు.
- వివిధ సర్కిళ్ల పరిధిలో ఏఈఈ/ఏఈ పోస్టుల్లో 20 శాతం రిటైర్డ్ ఇంజనీర్లతో నింపాలని నిర్ణయించారు. కొత్త నియామకాలు జరిగే వరకు ఈ వ ్యవస్థను కొనసాగిస్తామన్నారు.
- డిసెంబర్ 15 నాటికి 20 శాతం చెరువుల సర్వే, అంచనాలు పూర్తి కావాలని, నెలాఖరు కల్లా అన్ని చెరువులకు టెండర్లను ప్రకటించాలన్నారు.
- పనుల నాణ్యతలో ఈఎన్‌సీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి నేరుగా పంపాలన్నారు.
- చెరువుల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా చీఫ్ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారానికి కనీసం 10 చెరువులను సందర్శించాల్సి ఉంటుంది.