బుల్లెట్‌పై హరీశ్
సిద్దిపేటలో ఆకస్మిక తనిఖీలు
సిద్దిపేటజోన్: ప్రభుత్వ వాహనం లేదు.. కాన్వాయ్ సందడి లేదు.. చుట్టూ అధునా తన ఆయుధాలతో ఉండే అంగరక్షకులు లేరు. ద్విచక్ర వాహనంపై ఎలాంటి బందో బస్తూ లేకుండా, సాదాసీదాగా మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌ను వెంటపెట్టుకుని రెండు గంటల పాటు పట్టణమంతా పర్యటించారు మంత్రి హరీశ్‌రావు. పార్టీలో ఆరడుగుల బుల్లెట్‌గా చెప్పుకొనే హరీశ్... ఆదివారం తెల్లవారుజాము నుంచి బుల్లెట్‌పై పట్టణమంతా కలియతిరుగుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. మంత్రి పర్యటన విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు బందోబస్తు నిమిత్తం వచ్చినప్పటికీ వారిని పంపించి సమస్యలను పరిశీలించారు.
పలు కాలనీల్లో, ప్రధాన రోడ్ల వెంట ఆయన బుల్లెట్‌పై తిరుగుతూ పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. హరితహారం కింద పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. పాత బస్టాండ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మైటౌన్ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను చూసిన ఆయన.. దాని స్థానంలో పెద్దసైజులో స్క్రీన్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. అనంతరం మెదక్ రోడ్డులోని రైతుబజార్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు, చైర్మన్‌కు సూచనలు చేశారు.