పతంగ్షి‘కారు’
- గ్రేటర్‌లో చిగురిస్తున్న కొత్త మైత్రీబంధం
- ఎంఐఎం, టీఆర్‌ఎస్ దోస్తీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
- బల్దియా ఎన్నికల నాటికి బలోపేతం
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లో పతంగి కారెక్కుతోంది. ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య మైత్రికి తెరలేవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసిన పక్షంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ప్రకటించడంతోపాటు సోమవారం పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఎంఐఎం నేతలతో సంప్రదింపులు జరపడం పలు ఊహాగానాలకు తెర లేపుతోంది.
టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌లు సోమవారం బంజారాహిల్స్‌లోని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ నివాసానికి వెళ్లి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌తోపాటు అక్బర్‌తో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, పలు అంశాల్లో కలిసి పని చేసేందుకు తమతో కలిసి రావాలని గులాబీ నేతలు.. ఎంఐఎం అగ్ర నాయకులను కోరినట్లు తెలిసింది.
టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని అసద్, అక్బర్‌లు కోరగా.. అందుకు వారు అంగీకరించినట్లు సమాచారం. నూతన ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరాలన్న ప్రతిపాదనలు కూడా వారి ముందుంచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఒకవేళ ఎంఐఎం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేరితే మంత్రివర్గంలో అక్బరుద్దీన్ ఒవైసీకి కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా ఉభయ పక్షాల నేతలు చర్చించినట్లు తెలిసింది. అక్బర్‌కు డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా మైనార్టీ సంక్షేమ శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియో అప్పజెబుతామన్న దిశగా కూడా చర్చలు సాగినట్లు తెలిసింది. ఈ భేటీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాలా, మిరాజ్ హుస్సేన్, ముంతాజ్ ఖాన్‌లు పాల్గొన్నారు. అనంతరం అసద్ మీడియాతో సైతం మాట్లాడుతూ సెక్యులరిజాన్ని కాపాడటంతోపాటు అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించడం విశేషం.
బల్దియా ఎన్నికల్లో కొత్త సమీకరణాలు
ఉభయ పార్టీల మధ్య మైత్రి కుదిరిన పక్షంలో ఈ ఏడాది నవంబరులో జరగనున్న బల్దియా ఎన్నికల నాటికి ఇరు పక్షాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఎంఐఎం ఏడు శాసనసభా స్థానాల్లో గెలుపొందింది, మరో రెండు స్థానాల్లో గణనీయంగా ఓట్లు సాధించింది. ఇక టీఆర్‌ఎస్ మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడంతోపాటు మరో ఎనిమిదింట రెండో స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోఇరు పార్టీల మైత్రి బలపడితే మహానగరం పరిధిలో బలీయమైన రాజకీయ శక్తిగా ఈ కూటమి అవతరిస్తుందని భావిస్తున్నారు.
నగర అభివృద్ధికి ఊతం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభలో సైతం నగర అభివృద్ధికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న మతఘర్షణలు నివారించి..అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తాము టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించడం విశేషం.
టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తాం
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తాం. ఉభయ పక్షాల మధ్య చర్చ జరిగిన మాట వాస్తవమే. మైనార్టీల సంక్షేమం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
- అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభ్యుడు
రేపటి నుంచి ఇందోల్‌లో క్రికెట్ టోర్నీ
పెద్దేముల్, న్యూస్‌లైన్: మండలంలోని ఇందోల్‌లో యువసేన యూత్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్‌లు శ్రీకాంత్‌రెడ్డి, జగన్‌రెడ్డి, అంజి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నీలో పాల్గొనే జట్లు మంగళవారం వరకు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. విన్నర్ జట్టుకు రూ.6 వేల నగదు, జ్ఞాపిక, రన్నర్ జట్టుకు రూ.3500 నగదు, జ్ఞాపిక అందజేస్తామన్నారు. వివరాలకు 94918 76694, 90105 61054, 91603 03072 నంబర్లలో సంప్రదించవచ్చు.