సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమకు ఎన్నికల గుర్తులను కేటాయించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఎస్.రవి, మరో 15 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న తమకు ఇప్పటివరకు గుర్తులను కేటాయించకపోవడం, వాటి నమూనాలను ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన ఆదే శాలు జారీ చేయాలంటూ వారు గురువారం లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడే ఎన్నికల గుర్తుల ప్రాధాన్యతలను పేర్కొంటారని, అలా పిటిషనర్లు ఏం ప్రాధాన్యతలను ఇచ్చారో తమకు తెలియచేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం ఇప్పటి వరకు గుర్తులను కేటాయించకపోవడం వల్ల స్వతం త్ర అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. గుర్తు లేకపోవడంతో ఓటర్లకు ఆ విషయం చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారని వివరించారు. 64 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే, ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంల ద్వారానే ఎన్నిక నిర్వహిస్తామని చెప్పడం సరికాదన్నారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, నామినేషన్ దాఖలు చేసేటప్పుడే స్వతంత్ర అభ్యర్థులు తమ గుర్తుల విష యంలో ప్రాధాన్యతలు ఇస్తారని ఆ వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాతనే తదుపరి విచారణను కొనసాగిస్తామని తెలిపింది. నామినేషన్ పత్రా ల ప్రతులను తమకు అప్పగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్న రచనారెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతీ అభ్యర్థి కూడా నామినేషన్ ప్రతిని తన వద్ద ఉంచుకుంటారని, అందువల్ల వాటిని మీరే సమర్పించాలని రచనారెడ్డికి స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment