
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్‌తో గంటల తరబడి కుస్తీ పడితే హృదయ స్పందన వేగం పెరగడం తథ్యమట. నిత్యం 5–6 గంటలకు మించి సెల్‌ఫోన్‌తో కుస్తీపట్టడమే కాదు.. షర్ట్ జేబులో ఎక్కువసేపు భద్రపరచుకునే వారికీ కష్టాలు తప్పవట. నగరంలో 18–40 ఏళ్ల వయసున్న 10,000 మంది యువతపై దక్కన్ మెడికల్ కళాశాల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. సెల్ వినియోగంతో రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ విడుదలై ఆరు వేల మందికి తల, హృదయంపైనున్న కణ జాలంపై దుష్ప్రభావం పడినట్లు తేలింది. మానవ కణజాలం 0.08 వాట్/కేజీ రేడియో ఫ్రీక్వెన్సీని తట్టుకుంటుందని.. కానీ ప్రస్తుతం పలు బ్రాండ్ల మొబైల్స్ నుంచి సుమారు 1.6 వాట్/కేజీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ విడుదలవుతోందని హెచ్చరిస్తున్నారు. మరికొన్నింటిలో 2.0 వాట్/కేజీ కూడా ఉత్పన్నమవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామంతో హృదయ స్పందన వేగం పెరుగుతోందని.. ఇది ఏళ్లపాటు కొనసాగితే గుండె సంబం ధిత వ్యాధులు తథ్యమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు. తల, ఛాతిలోని కణజాలం దెబ్బతినడం, హృదయ స్పందన వేగం పెరగడం, గుండె దడ, తలనొప్పి వంటి విపరిణా మాలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇంట్లో లేదా ఆఫీసులో ఉన్న సమయంలో ఇయర్ ఫోన్స్ వినియోగించి మొబైల్‌లో మాట్లాడాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.