ఎన్‌కౌంటర్ కలకలం | Heavy Encounter in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్ కలకలం

Published Wed, Mar 2 2016 2:18 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Heavy Encounter in Chhattisgarh

* ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
* ఎనిమిది మంది మావోయిస్టులు మృతి
* మృతుల్లో జిల్లావాసులు ఉన్నట్లు ప్రచారం
* తూర్పు డివిజన్‌లో ముమ్మరంగా కూంబింగ్
* మావోయిస్టుల్లో జిల్లా నుంచి మిగిలింది
* 30 మందే అంటున్న పోలీసులు
కరీంనగర్ క్రైం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ జిల్లాలోనూ కలకలం సృష్టించింది. ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోరుుస్టులు మృతి చెందగా, వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు. మృతుల్లో జిల్లావాసులు కూడా ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది.

పోలీసులు ఉన్నతాధికారులు మాత్రం ఉన్నతాధికారులు మాత్రం జిల్లాకు చెందిన మావోయిస్టులు లేరని ప్రకటించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన గ్రేహౌండ్స్ దళాలు పక్కా సమాచారంతో కూబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఎనిమిది మంది మావోయిస్టుల్లో రాత్రి 8గంటల వరకు ముగ్గురిని గుర్తించారు. వీరిలో గుంటూరు జిల్లాకు బాపట్లకు చెందిన గొట్టెముక్కల రమేశ్ అలియాస్ లచ్చన్న, మెదక్ జిల్లా దౌల్తాబాద్ చెందిన యూసుఫ్ అలియాస్ సోనీతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజుగా గుర్తించారు.

ఈ ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఒక ఏకే47, ఐదు ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు 303 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లచ్చన్న ప్రస్తుతం చర్ల ఏరియా కమాండర్‌గా పని చేస్తున్నాడని అక్కడి పోలీసులు ప్రకటించారు. సంఘటన స్థలంలో ఏకే47 లభించడంతో మృతి చెందిన వారిలో డీసీఎం స్థాయి నేత ఉన్నాడని, ఐదు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు లభించడంతో కొంచెం పెద్దస్థాయి మవోయిస్టులుగానే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
కూంబింగ్ ముమ్మరం
గత కొంతకాలంగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని పోలీసులు అధికారులు పేర్కొంటున్నారు. అయితే మంథని డివిజన్‌లో అటవీ ప్రాంతాల్లో అడపాదడపా మావోయిస్టుల పేరిట వాల్‌పోస్టర్లు వెలుస్తుండటం వారి ఉనికిని చాటుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లు లేదా హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు మావోయిస్టులు గోదావరినది మీదుగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశించి రక్షణ పొందుతున్నట్లు అనుమానాలున్నాయి.

తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరగడంతో అక్కడ తప్పించుకున్న మావోయిస్టులు ఇటువైపు వచ్చే అవకాశముందని భావించిన పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఇప్పటికే ఆరు స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు నిర్వహిస్తుండగా, రెండు రోజుల క్రితం జిల్లా నుంచి మరో ఆరో పార్టీలు కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. దీంతో మొత్తం 12 బృందాలు కూబింగ్ కొనసాగిస్తున్నాయి. ఒక్కో పార్టీలో సుమారు ఇరవై మంది పోలీసులు ఉంటారు.

జిల్లా నుంచి 30 మంది...
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో జిల్లాకు చెందిన సుమారు 30 మంది వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 2015 వరకు 31 మంది ఉండగా, వీరిలో హుస్నాబాద్ సుభాష్‌నగర్ చెందిన గడ్చిరోలి యాక్షన్ కమిటీ మెంబర్ బుర్ర భాగ్య అలియాస్ అరుణ మూడు నెలల క్రితం లొంగిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సారంగపూర్ మండలం బీర్‌పూర్‌కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కలిపి రూ.3.08 కోట్ల రివార్డులున్నాయి. బీర్‌పూర్‌కే చెందిన నారాయణరావు, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌రావుతోపాటు ఆరుగురు కేంద్ర కమిటీలో ఉండగా.. వీరిపై రూ.25 లక్షలు రివార్డులున్నాయి. జిల్లా నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టుల లొంగుబాటుకు జిల్లా పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుర్ర భాగ్య లొంగిపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement