రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు మాటువేసి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
శుక్రవారం కూడా మావోయిస్టులు ఇదే రీతిలో భద్రతా బలగాలపై మెరుపుదాడి చేయడంతో 12 మంది జవాన్లు గాయపడ్డారు. మార్చి 4న సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు చనిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో జవాన్లు గాయపడటం సాధారణమే అయినా రోజుల వ్యవధిలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం గమనార్హం.