ఉగ్ర గోదారి
కుండపోత వర్షాలతో భారీ వరద
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 4.69 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు
- 42 గేట్లు ఎత్తి నీటి విడుదల.. పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తం
- సింగూరు, నిజాంసాగర్, ఎల్‌ఎండీల్లోకీ భారీగా నీటి చేరిక
- శ్రీశైలానికి లక్షా 26 వేల క్యూసెక్కుల వరద
- నిండుకుండల్లా 25 వేలకు పైగా చెరువులు.. 147 చోట్ల గండి
- వరదల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు
- జల సౌధలో కంట్రోల్ రూమ్.. ప్రాజెక్టుకో పర్యవేక్షణాధికారి
సాక్షి, హైదరాబాద్, బాల్కొండ: భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వస్తున్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోగా దిగువకు ఉరకలెత్తుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జల కళను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శని వారం రాత్రికి ఏకంగా 4.69 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో 42 గేట్లు ఎత్తి 3.29 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
మరోవైపు భారీగా వరదలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదలు, ప్రాజెక్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేం దుకు పర్యవేక్షణాధికారులను నియమించింది. సమన్వయం, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శని వారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు అలుగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన హరీశ్.. మధ్యాహ్నం లోయర్ మానేరు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. వరదల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.
ఎగువన భారీ వర్షాలతో..
మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం లక్షా 32 వేల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రికి అది ఏకంగా 6 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు)కాగా.. శనివారం రాత్రి 11 గంటలకు 1089.7 అడుగుల (84.01 టీఎంసీల)కు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరద ఇంకా భారీగా కొనసాగుతుండడంతో 42 గేట్లను ఎత్తి.. 3.29 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఉదయంకల్లా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుందని అధికారుల అంచనా. ఇక భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
నిండుకుండల్లా గోదావరి ప్రాజెక్టులు
గోదావరిపై ఉన్న మరో ప్రధాన ప్రాజెక్టు ఎల్లంపల్లి ఇప్పటికే నిండుకుండలా మారింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 72,832 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న నీరు ఆదివారం ఉదయానికి ఎల్లంపల్లికి చేరనుంది. దీంతో 57,388 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మానేరు, మోయతుమ్మెద వాగు, మూలవాగులు ఉప్పొంగుతున్నాయి. లోయర్ మానేరు డ్యాంలోకి 60 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి డ్యాంలో 9.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు మంజీరా నది పొంగి ప్రవహిస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 1.42 టీఎంసీల నిల్వ ఉంది. 17.80 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ఆదివారం సాయంత్రానికి పూర్తిగా నిండిపోయే అవకాశముంది. మొత్తంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులన్నీ నిండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి పెద్ద ఎత్తున వరద గోదావరిని చేరుతోంది. శనివారం సాయంత్రానికి 3,06,473 క్యూసెక్కుల వరద ధవళేశ్వరం బ్యారేజీకి చేరింది.
మహారాష్ట్రలో భారీ వర్షాలతో..
మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరి ఉరకలెత్తుతోంది. దీంతో విష్ణుపురి బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు శనివారం రాత్రి ఎస్సారెస్పీ అధికారులకు మహారాష్ట్ర అధికారులు సమాచారం అందించారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి గోదావరి వరద భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా ఆదేశించారు. ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
నిండిన చెరువులు
రాష్ట్రంలోని 45 వేల చెరువులకు గాను 25 వేలకు పైగా చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 7 వేల చెరువులు 75శాతం నిండాయని, మరో 5 వేల చెరువులు 50 శాతం, 6 వేల చెరువులు 25 శాతం నిండాయని పేర్కొన్నారు. ఇక 147 చోట్ల గండ్లు పడ్డాయని, వాతావరణం అనుకూలించిన చోట మరమ్మతులు ప్రారంభించామని తెలిపారు.
జూరాలకు భారీగా వరద
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో భారీగా వస్తున్న వరదను అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జూరాల ప్రాజెక్టుకు 1.2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 170.66 టీఎంసీలకు చేరుకుంది. మరో 45.12 టీఎంసీలు వస్తే శ్రీశైలం పూర్తిగా నిండనుంది. ఇక శ్రీశైలం దిగువన, నాగార్జున సాగర్‌కు ఎగువన వర్షాలు కురవకపోవడంతో సాగర్ డ్యామ్‌లోకి ప్రవాహాలేమీ రావడం లేదు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న 7,063 క్యూసెక్కులు మాత్రమే సాగర్‌లో చేరుతోంది. ప్రస్తుతం ఈ డ్యామ్‌లో 139.44 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్ నిండాలంటే మరో 172.61 టీఎంసీలు అవసరం. హైదరాబాద్, నల్లగొండ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ, మున్నేరు, పాలేరు వంటి ఉప నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. దాంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి.
జలసౌధలో కంట్రోల్ రూమ్ (040-23390794)
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టింది. వరదల పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు ఆ శాఖ ప్రధాన కార్యాలయం ‘జలసౌధ’లో కంట్రోల్ రూం (040-23390794) ఏర్పాటు చేసింది. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రతి గంటకోమారు ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ విజయప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్‌రూం పనిచేస్తుంది. నీటిపారుదల శాఖకు చెందిన వివిధ వాట్సప్ గ్రూపుల ద్వారా అందే సమాచారాన్ని విశ్లేషిస్తూ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో నీటి విడుదలపై ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతున్నారు. నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల వద్ద పరిస్థితిపై సమాచారం అందించేందుకు ఆయా ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణ అధికారులను నియమించారు. రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాల అమలు బాధ్యతను వారికి అప్పగించారు. నిజాంసాగర్‌కు సీఈ మధుసూదన్, ఎల్‌ఎండీకి సీఈ శంకర్, ఎల్లంపల్లికి సీఈ అనిల్, ఎస్సారెస్పీకి ఎస్‌ఈ సతీశ్, సింగూరుకు ఎస్‌ఈ శ్రీకాంత్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. జలసౌధ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరంగా వరద పరిస్థితిని పర్యవేక్షించే బాధ్యతను ఈఎన్‌సీ విజయప్రకాశ్, చీఫ్ ఇంజనీర్లు నాగేందర్, సురేశ్‌లకు అప్పగించారు.