ఒప్పందంతో బాధ్యత పెరిగింది
అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం తో నీటిపారుదల విభాగం బాధ్యత మరింత పెరిగిందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చె ప్పారు. ఒప్పంద స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఇక్కడి ఐడీసీ కార్యాలయంలో కాళేశ్వరంతో పాటు కరీంగనర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షించారు.
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బాల్క సుమన్, బి.వినోద్, ఎంఎల్‌ఏలు పుట్ట మధు, విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, కార్యదర్శి వికస్‌రాజ్, సీఈలు ఎన్.వెంకటేశ్వర్లు, బి.హరిరామ్, అనిల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే హాజరయ్యారు. బ్యారేజీల దగ్గర క్యాంపులను ఏర్పాటు చేసి పనులు ఆరంభించాలని వర్కింగ్ ఏజెన్సీలను మంత్రి కోరారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు చేపట్టిన ప్యాకేజీ-6, 8 లకు చెందిన పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని 2017 జూలై చివరి నాటికి, ప్యాకేజీ 10, 11, 12 పంప్‌హౌస్‌లను 2017 సెప్టెంబర్ నాటికి, ప్యాకేజీ 20 పంప్‌హౌస్ నిర్మాణాన్ని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు.
నెలాఖరుకు డ్రై రన్...
ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా ఉన్న వేమునూరు, గంగాధర, మేడారం పంప్‌హౌస్‌ల డ్రై రన్‌ను ఈ నెలాఖరులో చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 5న వెట్ రన్ ఆరంభించేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. ఎల్లంపల్లిలో మిగిలి పోయిన 920 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని, ఇది పూర్తయితే 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు కింద సేకరించిన 1600 ఎకరాలను గ్రామస్తులకు తిరిగే ఇచ్చే అంశాన్ని సైతం సమీక్షలో చర్చించిన మంత్రి... ఇందులో 117 ఎకరాలు లింక్ కెనాల్ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, కొడిమ్యాల మండలాల్లో వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని సూచించారు.