భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయూనికి భక్తులు శనివారం పోటెత్తారు. దసరా సెలవులు ముగుస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో రామాలయం శ్రీరామనామ స్మరణతో మారుమోగింది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఏఈఓ శ్రావణ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రామయ్యకు బంగారు తులసీ పుష్పార్చన :
శ్రీసీతారామచంద్రస్వామి వారికి బంగారు తులసీ దళార్చన నిర్వహించారు. స్వామివారి మూలవరులకు అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన నిర్వహించి పవిత్ర గోదావరి నుంచి తీర్థ జలాలను తెచ్చి పంచామృతాలు, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలతో భద్రుని మండపంలో అభిషేక తిరుమంజనం నిర్వహించారు. అనంతరం 108 బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు.
తదుపరి స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను బేడా మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి.. ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. నిత్య కల్యాణంలో 92 జంటలు పాల్గొన్నాయి. ఆలయ వేదపండితులు మురళీకృష్ణమాచార్యులు రామాయణం, రాముని ఔన్నత్యం గురించి భక్తులకు ప్రవచనం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రిలో పోటెత్తిన భక్తులు
Published Sat, Oct 24 2015 6:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM
Advertisement
Advertisement