సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) హెర్బల్ ఉత్పత్తులతో మార్కెట్లోకి అడుగు పెడుతోంది. హెర్బల్ సబ్బులు, గ్లిజరిన్ సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం యంత్రాలను సిద్ధం చేసుకున్న జీసీసీ.. యూనిట్ల ఏర్పాటులో నిమగ్నమైంది. ఉత్పత్తుల తయారీలో ఆయూష్ శాఖ సహకారాన్ని తీసుకోవా లని నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖతో అవగాహ న కుదుర్చుకోనుంది.
హెర్బల్ ఉత్పత్తులకు సంబంధించి ముడి సరుకులో మూలికల వాడకంపై ఆయూష్ యంత్రాంగం సూచనలు చేయనుంది. ఏయే ఉత్పత్తిలో ఎంత మోతాదులో మూలికలు వినియోగించాలో అందుకు సంబంధించి ఆయూష్ అధికారులు ఫార్ములా ఖరారు చేస్తారు. ప్రస్తుతం జీసీసీ ద్వారా విక్రయించే తేనెకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో హెర్బల్ ఉత్పత్తులను కూడా అదే స్థాయిలో తీసుకొచ్చేందుకు, దేశీయ మార్కెట్లో తన బ్రాండును విస్తృతం చేసేందుకు సరికొత్త పంథాతో జీసీసీ ముందుకెళ్తోంది.
గిరి నేచర్.. గిరి గోల్డ్..
జీసీసీ సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలకు సహజసిద్ధమైన పేర్లను అధికారులు సూచిస్తున్నారు. గిరి నేచర్ పేరుతో సౌందర్య సబ్బులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అలోవెరా, బొప్పాయి, నీమ్ పేర్లతో మూడు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. గిరి గోల్డ్ పేరుతో గ్లిజరిన్ సబ్బులు రానున్నాయి.
వీటితో పాటు గిరి డిటర్జెంట్, గిరి నేచర్ షాంపూలూ మార్కెట్లోకి తెచ్చేందుకు జీసీసీ సిద్ధమవుతోంది. జీసీసీ ఉత్పత్తులకు క్షేత్రస్థాయిలో డిమాండ్ ఉంది. ప్రస్తుతం తయారు చేస్తున్న ఉత్పత్తులను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. గురుకులాల్లో రూ.250 కోట్ల టర్నోవర్‌కు అవకాశం ఉందని జీసీసీ భావిస్తోంది.
గిరిజన యువతకు ప్రాధాన్యం
తయారీ కేంద్రాల్లో స్థానిక గిరిజన యువతకు అవకాశం కల్పించనున్నారు. మార్కెటింగ్ రంగంలోనూ గిరిజన యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే నెలలో ఈ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జీసీసీ జనరల్ మేనేజర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment