
ఇక్కడి వనరులు ప్రజాభివృద్ధికే ఉపయోగపడాలి
- ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవడం అందరి లక్ష్యం
- ఏపూరి సోమన్న పాటల సీడీ ఆవిష్కరణలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
- కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు
హైదరాబాద్: ప్రజల అభివృద్ధికి ఇక్కడున్న వనరులు ఉపయోగపడాలని, ఆ దిశగా పాలన కొనసాగాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక తెలంగాణ గుండె చప్పుడు ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న రాసి పాడిన ’గడీల పాలనపై ఏపూరి గళం’ అనే పాటల సీడీని కోదండరాం ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది పాటలేనన్నారు. ఉద్యమ ఆకాంక్షలను సాధించు కోవాలనేది అందరి లక్ష్యమన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ తెలంగాణలో బడుగుల బతుకులు బాగుపడుతాయని సోనియా తెలంగాణ ఇచ్చిందని అన్నారు.
తెలంగాణలో నాయకత్వం అమ్ముడుపోవచ్చు కాని ప్రజలు అమ్ముడు పోరన్నారు. రూ.100 కోట్లతో ఇల్లు నిర్మించుకున్న వారు ఎవరూ లేరని, చివరికి బాత్ రూమ్‌ను కూడా బుల్లెట్ ప్రూఫ్‌తో కట్టుకున్నాడని సీఎంను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటానని చెప్పిన కేసీఆర్ తెలంగాణ కళాకారులందరిని కాపల కుక్కలుగా చేయాలని భావించినట్లు విమర్శించారు. కేసీఆర్ నన్ను వాడుకోవటమే కాదు.. నాకు కూడా వాడుకోవటం తెలుసునని చెప్పారు. విమలక్క మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచి వేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
దొరల పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి అనేది పేపర్లు, టీవీల్లోనే కనిపిస్తుంది తప్ప ప్రజల్లో కాదని విమర్శించారు. ఏపూరి సోమన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎడిటర్ కె.శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, నాయకులు శ్రవంత్‌రెడ్డి, మాదిగ దండోర నాయకులు సతీశ్, వరంగల్ రవి తదితరులు పాల్గొన్నారు.