
సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు కోసం ఆ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా సమగ్ర సర్వేపై రామ్మోహన్ చౌదరి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సర్వే వివరాల డేటా ఎంట్రీ పనులను ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించారని, దీనివల్ల వ్యక్తిగత సమాచారం బయట వ్యక్తులకు వెళుతుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.