
ఆస్పత్రి తరలింపుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
హైదరాబాద్: ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రి తరలింపు జోక్యం చేసుకోబోమని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆస్పత్రి తరలింపు చట్టవ్యతిరేకం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన కోర్టు ఆస్పత్రి తరలింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు యిచ్చుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో బుధవారం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రిని తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, 2008లో నిర్ణయించిన విధంగా ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు.