సచివాలయంలో ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత
కేసీఆర్ ఫొటో.. సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. సచివాలయంలో ఎన్నాళ్లుగానో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల నేత పద్మాచారి ముందుగా కేసీఆర్ నిలువెత్తు ఫొటో తీసుకుని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఉద్యోగుల కార్యాలయానికి వచ్చారు. ఈ కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నామని ఆయన ప్రకటించారు.
దీనికి అక్కడే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కేటాయించిన ఈ కార్యాలయాన్ని మీరెలా తీసుకుంటారని వారు అడ్డుకున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘానికి మాత్రమే గుర్తింపు ఉంది. అందుకోసం వారి సంఘానికి సచివాలయ ప్రాంగణంలో ఓ కార్యాలయం కేటాయించడమే కాక, దాని నిర్వహణకు నిధులను కూడా ప్రభుత్వమే ఇస్తోంది. తెలంగాణ ఉద్యోగులకంటూ ప్రత్యేకంగా కార్యాలయం లేదు. దాంతో ఇప్పుడున్న కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు పద్మాచారి ప్రకటించి, అక్కడ కేసీఆర్ నిలువెత్తు ఫొటో తగిలించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు మురళీ కృష్ణ తదితరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, వాదులాట చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో సచివాలయంలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది.
నిజానికి మరో రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అపాయింటెడ్ డే కూడా దగ్గర పడింది. అయినా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులపై ఇంతవరకు సరైన మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఎవరెవరు ఏయే రాష్ట్రాలకు పనిచేయాల్సి ఉంటుందో కూడా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేయడానికి వీల్లేదని, తాత్కాలిక ప్రాతిపదికన అయినా వాళ్లు ఇక్కడ పనిచేసేందుకు తాము అంగీకరించేది లేదని ఇటు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు ప్రకటిస్తున్నారు. అయినా.. ఇంతవరకు ఏమీ తేలకపోవడమే రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య విభేదాలకు కారణమైంది. ఇది ఇంకెంత దూరం వెళ్తుందో, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.