
బోధన్‌రూరల్: హోలీ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్స గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠగా సాగింది. ముందుగా గ్రామ శివారులో కుస్తీ పోటీలను నిర్వహించారు. హనుమాన్ మందిరం ఎదురుగా ఖాళీ ప్రదేశంలో పిడిగుద్దులాటకు వేదికను సిద్ధం చేశారు. 5 ఫీట్ల ఎత్తుతో ఉన్న బలమైన కర్రలను నిలిపి పొడువైన తాడును కట్టారు. కుస్తీ పోటీల అనంతరం పిడిగుద్దులాట ప్రక్రియను ప్రారంభించారు.
డప్పు వాయిద్యాలతో గౌరవ సూచికంగా గ్రామ పెద్దలను వేదిక వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే తాడుకు ఇరువైపులా గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయి మోహరించి ఉన్నారు. పిడిగుద్దులాట కోసం ఏర్పాటు చేసిన తాడును ఎడమ చేయితో పట్టుకుని కుడి చేయి పిడికిలి బిగించి ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఆట ముగిసినట్టు గ్రామ పెద్దలు ప్రకటించిన వెంటనే గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment