పిడికిళ్లు బిగించి... పంచ్‌లు విసిరితే... హోలీ!
బోధన్ (నిజామాబాద్): హోలీ అంటే ‘రంగుపడుద్ధి’ అని చెప్పడం సర్వసాధారణం... కానీ ఇక్కడ మాత్రం పంచ్ పడుద్ధి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు రంగులు చల్లుకున్నా... చల్లుకోకపోయినా... పిడిగుద్దులు మాత్రం కురిపించుకోవాల్సిందే. అదే ఇక్కడి విశిష్టత. గ్రామ శ్రేయస్సు కోసం 125 ఏళ్ల నుంచి ఇక్కడి వారు దీన్ని ఆచరిస్తున్నారు. శుక్రవారం కూడా ఈ వేడుక చాలా ఉత్కంఠతతో నడిచింది. హనుమాన్ మందిరం ఆవరణలో వేదిక ఏర్పాటు చేయగా... గ్రామస్తులు రెండు బృందాలుగా విడిపోయి తాడుకు ఇరువైపులా నిలిచారు.
గ్రామ పెద్దలంతా వేదిక వద్దకు చేరుకోగానే ఒకరిపై మరొకరు పిడి గుద్దులు కురిపించుకోవడం మొదలు పెట్టారు. అరగంట తర్వాత ఈ వేడుక ముగిసింది. దీన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు.