- రిమాండ్ ఖైదీకి కానిస్టేబుల్ సహకారం
- కమిషనర్ ఆగ్రహం
- నగరంలోని కోర్టుల సిబ్బందిని తప్పించాలని ఆదేశం
- కొత్త వారిని నియమించాలని ఉత్తర్వులు
సాక్షి, సిటీబ్యూరో: కాసుల కక్కుర్తితోఓ కానిస్టేబుల్ విద్యుక్త ధర్మానికి నీళ్లొదిలాడు.జైలుకు పంపించాల్సిన నిందితుడిని దర్జాగా ఇంటికి పంపించాడు. వివరాలివీ... దేవనాథ్‌రెడ్డికి బంజారాహిల్స్‌లో ఓ ప్రైయివేటు కార్యాలయం ఉం ది. ఈ కార్యాలయం ద్వారా ఆర్డర్ పొందిన రాంచ ందర్ నాయక్ ఆధార్ కార్డులను తయారు చేశాడు. బిల్లులు చెల్లించాలని పలుమార్లు నాయక్ అతని కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. దీంతో తన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని నాయక్‌పై 2010లో దేవనాథ్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు నాయక్‌పై ఐపీసీ 384 (దాడికి పాల్పడినట్లు) కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాయక్ అరెస్టయి, బెయిల్ పొందాడు. తాను తయారు చేసిన ఆధార్ కార్డులకు బిల్లులు ఇవ్వకపోవడమే కాకుండా కేసు పెట్టించాడనే కక్షతో నాయక్ 2013లో దేవనాథ్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు రావల్సిన బిల్లును ఇవ్వకుండా మోసగించాడని ఫిర్యాదులో పేర్కొనడంతో దేవనాథ్‌రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న దేవనాథ్‌రెడ్డి తన న్యాయవాది ద్వారా నాంపల్లి కోర్టులో రెండు నెలల క్రితం ఓ రోజు మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయాడు. దీంతో మెజిస్ట్రట్ అతడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు.
మలుపు తిరిగింది ఇక్కడే...
జైలుకు వెళ్లడం ఇష్టంలేని దేవనాథ్‌రెడ్డి చేసేదిలేక నాయక్‌తో రాజీ కుదుర్చుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులను వాపస్ తీసుకునేందుకు ఇద్దరూ సిద్ధపడ్డారు. ఈ మేరకు అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు లోక్‌దాలత్‌లో రాజీ అవుతున్నట్లు పిటిషన్ వేసుకున్నారు. పిటిషన్‌ను పరిశీలించిన లోక్‌అదాలత్ మెజిస్ట్రేట్ ఈ రెండు కేసుల్లో రాజీ చేసేందుకు వీలు ఉండదని, ఐపీసీ 384లో రాజీ కుదరదని తిరస్కరించారు. అప్పటికే సాయంత్ర ం నాలుగు గంటలైంది. పిటిషన్ తిరస్కరణకు గురికాగానే దేవనాథ్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు జ్యూడీషియల్ కస్టడీకి తరలించాల్సి ఉంది. ఇక్కడ ఎలాంటి బేరసారాలు జరిగాయో తెలియదు గానీ ఎస్కార్ట్‌గా ఉన్న కానిస్టేబుల్ దేవనాథ్‌రెడ్డిని జైలుకు పంపకుండా ఇంటికి పంపించాడు.
అందరినీ తప్పించండి
ఈ విషయం కమిషనర్ ఎమ్.మహేందర్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడికి సహకరించిన కానిస్టేబుల్‌తో పాటు నగరంలోని అన్ని కోర్టులలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని వెంటనే తప్పించి, ఆగస్టు 7వ తేదీలోగా కొత్త వారిని నియమించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల ఠాణాలు, మహిళా ఠాణాలు, సైబర్ క్రైమ్ స్టేషన్, సీసీఎస్‌ల నుంచి సికింద్రాబాద్, నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు, పాతబస్తీలోని సివిల్ కోర్టు తదితర చోట్ల విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐలను వెంటనే తప్పించి, కొత్తవారిని నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమూలంగా ప్రక్షాళన చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కమిషనర్ అభిప్రాయపడ్డారు. అయితే ఎవరో ఒకరు చేసిన పొరపాటుకు అందరినీ బలిచేయడం సబబు కాదని కోర్టు విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది అంటున్నారు.