మెదక్ రూరల్: కాంట్రాక్టు ఉద్యోగులుగా చాలీ చాలని వేతనాలతో ఏళ్ల తరబడి దుర్భర జీవితాలను గడుపుతున్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో ఆశలు చిగురించాయని తెలంగాణ రాష్ట్ర టెక్నికల్(ఈజీఎస్) ఎంప్లాయీస్ అధ్యక్షుడు మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో బతుకులీడుస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని సీఎం హామీ ఇవ్వడం హర్షించ దగ్గ విషయమన్నారు.
కాగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దంటూ ఆందోళనలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ బాధలను అర్థం చేసుకుని ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామంటే అభినందించాల్సిందిపోయి ఆందోళనలు చేపట్టడం తగదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తాము కూడా పాల్గొని ఆందోళనలు చేపట్టామన్నారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామన్నారు.
నూతన కార్యవర్గం..
జిల్లా ఉపాధి హామీ పథకం నూతన కార్యవర్గాన్ని ఆదివారం మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సుభాష్ (మిరుదొడ్డి) జనరల్ సెక్రటరీగా నరేందర్‌రెడ్డి (రేగోడు) వైస్ ప్రెసిడెంట్‌గా లక్ష్మారెడ్డి (కొండాపూర్) సభ్యులుగా శ్రీనివాస్ (ములుగు) వెంకట్‌రెడ్డి(నర్సాపూర్) స్వామిగౌడ్(వర్గల్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సీఎం హామీతో కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు
Published Sun, Jul 27 2014 11:50 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM