ఆస్తిపన్నుఅప్‌'లేట్‌'! | House Tax Updates Delay In GHMC Website | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్నుఅప్‌'లేట్‌'!

Published Thu, Mar 29 2018 8:41 AM | Last Updated on Thu, Mar 29 2018 8:41 AM

House Tax Updates Delay In GHMC Website - Sakshi

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రంగారావు గత డిసెంబర్‌లోనే తన ఇంటి తాలూకు ఆస్తిపన్ను రెండో వాయిదా రూ.6,780  ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో మరోసారి తన ఇంటి పన్ను వివరాలు చూసుకునేందుకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయగా...తాను ఇంకా రెండో వాయిదా చెల్లించనట్లుగా చూపుతోంది. దీంతో అవాక్కయిన రంగారావు సమీపంలోని జోనల్‌ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ ఉన్నతాధికారి ద్వారా వివరాలు అప్‌డేట్‌ చేయించుకుని ఊపిరిపీల్చుకున్నాడు. ఇలా...అప్‌డేట్‌ కాని వివరాలతో  నగరంలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులు అవస్థలు పడుతున్నారు. అసలు తాము మళ్లీ ఆస్తి పన్ను చెల్లించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఆస్తి పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ కావడంలేదని ఇటీవల విమర్శలు వస్తున్నాయి. ఒక వైపు డిజిటల్‌ లావాలదేవీలు పెంచుతామంటూ..మరోవైపు సైట్‌ను సక్రమంగా నిర్వహించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆస్తి పన్ను వివరాలు చూసుకునేందుకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోని సంబంధిత లింక్‌ను ఓపెన్‌ చేసేందుకే ఎంతో సమయం పడుతోంది. తీరా ఓపెన్‌ చేసి చూశాక  ఆన్‌లైన్‌లో చెల్లించిన ఆస్తి పన్ను వివరాలు సైట్‌లో చూపకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఆబిడ్స్‌లోని ఓ వ్యాపార సంస్థ చెల్లించిన దాదాపు రూ.16 లక్షల 50 వేల రూపాయలు కూడా చెల్లించినట్లు చూపకపోవడంతో వారు హతాశులయ్యారు. ఎట్టకేలకు సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించగా, చెల్లించినట్లు నమోదైంది. ఇలా పబ్లిక్‌ డొమైన్లలో తాజా వివరాలు లేకపోవడంతో పలువురు ఆందోళనలు చెందుతున్నారు. ఎందరికో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ అంశాల్లో నెంబర్‌వన్‌గా ఉన్నామని,  దేశంలోనే అనేక అంశాల్లో మేమే టాప్‌ అని, ఈఓడీబీ, ఈ –ఆఫీస్‌ వంటి అంశాల్లోనూ ముందంజలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న జీహెచ్‌ఎంసీలో ఇలాంటి స్వల్ప సమస్యలపై అధికారులు శ్రద్ధ వహించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్లకు ఆస్తిపన్ను చెల్లించిన వారితోపాటు  ఈసేవ, మీసేవ, సీఎస్సీల్లో చెల్లించిన వారికి సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు ఎంతోకాలంగా ఉన్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థిక సంవత్సరం ముగియవస్తున్న తరుణంలో ప్రజలకు మనశ్శాంతి లేకుండా పోతోంది. జీహెచ్‌ఎంసీకి ఐటీ విభాగమంటూ ఉన్నా ఆన్‌లైన్‌కు సంబంధించిన పనులన్నీ సీజీజీకి అప్పగించారు. వెబ్‌సైట్‌లో జీహెచ్‌ఎంసీకి సంబంధించి గతంలో ఉన్న పలు వివరాల్లేవు. అదేమంటే అప్‌డేట్‌ జరుగుతోందని చెబుతున్నారు. నెలల తరబడి ఇదే సమాధానం. ఏటా వెయ్యికోట్లకు పైబడి ఆస్తిపన్ను వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీలో ఇదీ పరిస్థితి. బిల్‌ కలెక్టర్లకు ఆస్తిపన్ను చెల్లించిన వివరాలు సైతం హ్యాండ్‌ హెల్డ్‌ డివైజ్‌ నుంచి రసీదు ఇచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటిది సీఎస్సీలు, మీసేవల్లో చెల్లించిన వివరాలు అప్‌డేట్‌ కాకపోవడం ఏమిటో అంతుపట్టడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement