ఆకాశానికి చిల్లు! | Huge rain in the Hyderabad city | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 3 2017 1:57 AM | Last Updated on Tue, Oct 3 2017 11:54 AM

Huge rain in the Hyderabad city

సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెరువులా మారిన అమీర్‌పేట రహదారి

సాక్షి, హైదరాబాద్, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా జడివాన దంచి కొట్టింది. కుంభవృష్టితో హైదరాబాద్‌ నగరం చిగురు టాకులా వణికిపోయింది. పట్టపగలే చీకట్లు కమ్ముకుని.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం అలజడి సృష్టించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు మొదలై.. రాత్రి 9 గంటల వరకు విలయ తాండవం చేసింది. నగరంలోని పలు చోట్ల కేవలం రెండు గంటల వ్యవధిలోనే పది సెంటీమీటర్లకుపైగా కుండపోత కురిసింది. మీరాలంలో ఏకంగా 13.5 సెంటీ మీటర్లు, రాజేంద్రనగర్, అంబర్‌పేటల్లో 12 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. వరద నీటితో చాలా బస్తీలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపించాయి. చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ కుండపోత కురిసింది. ముఖ్యంగా పాత మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల వాగులు వంకలు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమ త్తంగా ఉండాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భారీ వర్షంతో మంత్రి హరీశ్‌రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు సమస్య తలెత్తింది. పైలట్‌ దానిని హైదరాబాద్‌ శివార్ల లోని హకీంపేట సైనిక ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లి ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

మరో మూడు రోజులు
రాయలసీమపై ఉపరితల ఆవర్తనం, ఒడిశా, కేరళ మధ్య తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరించారు. సోమవారం రాజేంద్రనగర్‌లో 11, అంబర్‌పేట, గోల్కొండలలో 9, కోస్గి, హన్స్‌వాడలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

‘గ్రేటర్‌’లో అలజడి
హైదరాబాద్‌లో ఆకాశానికి చిల్లులుపడ్డాయా అన్నంతగా కుండపోత వర్షం కురిసింది. క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతంగా ఆవరించడంతో సాయంత్రం 4 గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. కాసేపటికే ఉరుములు, మెరుపులు, గాలులతో ప్రారంభమైన జడివాన.. రెండు గంటల పాటు ఉగ్రరూపం చూపించింది. ఈ రెండు గంటల్లోనే చాలా ప్రాంతాల్లో ఏకంగా పది సెంటీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమో దైంది. మీరాలం, మోండా మార్కెట్, అం బర్‌పేట్, గోల్కొండ, ఆసిఫ్‌ నగర్, సర్దార్‌ మహల్, నారాయణగూడ, ముషీరాబాద్, మైత్రీ వనం, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో దంచి కొట్టింది. భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోయాయి. వంద బస్తీలు నీటమునిగాయి.

నగరంలో పలు నాలా లు ఉప్పొంగాయి. చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించి పో యింది. సుమారు వంద జంక్షన్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ కూడా పనిచేయకుండా మొరాయించాయి.  కార్లు, బైకుల ఇంజన్లలోకి నీరు చేరి ఆగిపోయాయి. 50 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సర ఫరాకు 2, 3 గంటలపాటు అంత రాయం కలిగింది. పాత నగరంలోని ముర్గీచౌక్‌ ప్రాంతంలో ఓవ్యక్తి విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు.

రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
భారీ వర్షాలు కురవడం, మరో రెండు మూడు రోజుల పాటు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. నగరవ్యాప్తంగా అత్యవసర చర్యలు చేపట్టేందుకు 55 అత్యవసర బృందాలను రంగంలోకి దించింది.

జిల్లాల్లో జోరువాన..
మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల వాగులు వంకలు ఉప్పొంగాయి. నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పలు చోట్ల చెరువులు నిండి అలుగుపోశాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా కురిసింది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, బీబీనగర్, పోచంపల్లి, మోటాకొండూరు సహా అన్ని మండలాల్లో భారీ వర్షంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. బీబీనగర్‌ మండలం జమీలాపేట్‌–జియాపల్లి వద్ద చెరువు అలుగు పోస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షంతో ఆ నీరంతా మూసీలోకి చేరి.. ఉధృతంగా ప్రవహిస్తోంది.  మూసీ పరీవాహకం లోని బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ తెలిపారు.

ఎందుకింత ఉధృతి..?
ప్రస్తుత సీజన్‌లో గాలిలో తేమశాతం అధికంగా ఉండడం, మరోవైపు ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో అస్థిరత ఏర్పడి... అత్యంత ఎత్తు, తీవ్రత, ఉధృతి కలిగిన క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్త రాజారావు తెలిపారు. వాటి కారణంగానే సాయంత్రం 4 గంటలకే చీకట్లు కమ్ముకుని, తక్కువ సమయంలో అధిక వర్షపాతం సంభవిస్తోందని వెల్లడించారు. సాధారణంగా వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్‌ మేఘాల కంటే.. ఇప్పుడు ఏర్పడే వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

వర్షాలకు ఏడుగురు బలి
భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఏడుగురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అబ్బెందకు చెందిన చౌకాన్‌పల్లి శకుంతల (46), ఆమె కుమారుడు చంద్రకాంత్‌ (23), సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం పూసల్‌పాడ్‌కు చెందిన పాటిల్‌ బసమ్మ (45), ఆమె కుమారుడు రవికుమార్‌ (25)లు పిడుగులు పడి మరణించారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ పరిధిలోని పోమ్యానాయక్‌ తండాలో పిడుగుపాటుకు లచ్చు నాయక్, ఆయన భార్య మోతిబాయిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని నాయుడునగర్‌ బస్తీలో వరద నీటికి కొట్టుకొచ్చి మట్టిలో కూరుకుపోయి యాదులు అలియాస్‌ జాన్‌ (30), ఆయన ఆరు నెలల కుమారుడు కన్నుమూశారు.

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లో పరిస్థితిపై సోమవారం రాత్రి జీహెచ్‌ఎంసీ కమిషనర్, నగర పోలీస్‌ కమిషనర్‌లతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షం కురుస్తూనే ఉన్న నేపథ్యంలో సోమవారం రాత్రంతా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండా లని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం సూచించారు.

సహాయక చర్యలు మొదలయ్యాయి: కేటీఆర్‌
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించారని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. భారీ వర్షాల పరిస్థితిని సమీక్షించిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులంతా రంగంలోకి దిగారని..  జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సహాయక చర్యల పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ కూడా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఏర్పాటు చేసిందని.. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా కృషి చేస్తోందని చెప్పారు. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలడం, విద్యుత్‌ తీగలపై చెట్లు విరిగిపడడంతో వాటిని తొలగించే పని చేపట్టారని తెలిపారు. వర్షాలు కొనసాగుతూనే ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకంగా మారిందన్నారు. పరిస్థితులను నగర మేయర్, మున్సిపల్‌ కమిష నర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రజలు అత్యవసర సహాయం, సహకారాల కోసం 100 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement