అనుమానంతో భార్య గొంతుకోసి హతమార్చేందుకు భర్త ప్రయత్నించిన సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో ఆదివారం ఉదయం జరిగింది
ఖమ్మం: అనుమానంతో భార్య గొంతుకోసి హతమార్చేందుకు భర్త ప్రయత్నించిన సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో ఆదివారం ఉదయం జరిగింది. విజయలక్ష్మి (38) అనే వివాహిత ఐసీడీఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్‌గా పనిచేస్తూ కలూరులో నివాసం ఉంటోంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త రామూ ఆదివారం ఉదయం హత్యాయత్నం చేశాడు.
కత్తితో గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు పరుగున వచ్చి రామూను అడ్డగించి తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. హత్యాయత్నం చేసిన రామును పోలీసులకు అప్పగించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.