కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న దత్తాత్రేయ, రాంచందర్ రావు తదితరులు
హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిపై డీజీపీ విధించిన నగర బహిష్కరణను ఎత్తి వేయాలంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు వీహెచ్‌పీ,బీజేపీ, ఏబీవీపీ నేతలు ధర్నా చేశారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేతలు. కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు.
పరిపూర్ణానంద స్వామిపై డీజీపీ మహేందర్ రెడ్డి నగర బహిష్కరణను విధించడం అమానుషమన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరించడం తగదన్నారు. సీఎం కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను గుర్తుచేస్తోందన్నారు. ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వడం లేదని ఇదేమి ప్రజాస్వామ్యమని అన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ,ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితర నేతలను, వీహెచ్‌పీ, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించి, అనంతరం విడిచి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment