ఆన్‌లైన్‌ ఫీ‘జులుం’.. ఐడీ, పాస్‌వర్డ్‌ల నిరాకరణ | Hyderabad Corporate Schools Demands Online Teaching Fees | Sakshi
Sakshi News home page

సగం జీతాలతో.. ఫీజులెలా కడతాం?

Published Fri, Jun 26 2020 8:35 AM | Last Updated on Fri, Jun 26 2020 8:35 AM

Hyderabad Corporate Schools Demands Online Teaching Fees - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అధికారికంగా విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభమే కాలేదు. అసలు ఈ ఏడాది అవుతుందో.. కాదో? అనే అంశంపై స్పష్టత కూడా రాలేదు. కానీ నగరంలోని పలు కార్పొరేట్, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్‌ టీచింగ్‌ పేరుతో తరగతులను ప్రారంభించాయి. పది రోజులైందో లేదో అప్పుడే ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లించని వారికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ల జారీని నిలిపివేస్తున్నాయి. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగుతున్నాయి. తాజాగా హిమాయత్‌నగర్‌లోని ఓ కార్పొరేట్‌ స్కూలు యాజమాన్యం ఇదే అంశంపై ఒత్తిడి తీసుకురాగా, హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే..  
తెలంగాణ వ్యాప్తంగా 34 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో 15 లక్షల మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నారు. నగరంలో సుమారు 25 ఇంటర్నేషనల్‌ స్కూళ్లున్నాయి. నాలుగు వేలకుపైగా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. 80 శాతం మంది విద్యార్థులు వీటిలోనే చదువుతున్నారు. ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.రెండు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్‌ స్కూళ్లలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, షూ, యూనిఫాం, స్టేషనరీ అదనం. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం మార్చి 22 నుంచి అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఏటా జూన్‌ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వైరస్‌ దృష్ట్యా.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అసలు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందో లేదో చెప్పడం కూడా కష్టమే. కానీ ఇంటర్నేషనల్, కార్పొరేట్‌ స్కూళ్లు మాత్రం ఇప్పటికే ఆన్‌లైన్‌ బోధన పేరుతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి.  విద్యార్థులకు ‘ఈ’ పాఠాలను తప్పనిసరి చేశాయి. యూనిఫాం వేసుకుంటేనే కంప్యూటర్‌ ముందు కూర్చోవాలనే నిబంధనలు కూడా పెట్టేశాయి. పాఠశాల వేదికగా పెద్దపెద్ద స్టేషనరీలు తెరిచి, స్కూలు ప్రాంగణంలోనే పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్స్, షూ, యూనిఫాం, స్కూలు బ్యాగులు.. టిఫిన్‌ బాక్స్‌లు.. ఇలా అన్ని వస్తువులను యథేచ్ఛగా విక్రయిస్తున్నాయి. ఇదే అంశాన్ని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫీజులను నిరసిస్తూ హిమాయత్‌నగర్‌లో ఓ స్కూల్‌ ఎదుట  పేరెంట్స్‌ నిరసన(ఫైల్‌)
పిల్లలకు కంటి, వెన్నెముఖ సమస్యలు..
ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలు మూడు నుంచి నాలుగు గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చొవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వెన్నునొప్పితో పాటు ఎక్కువ సేపు స్క్రీన్‌ వైపు చూడటంతో కంటిచూపు దెబ్బతింటోంది. చాలామంది విద్యార్థులు తలనొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నారు.  అంతేకాదు.. టీచర్‌ చెప్పేది సరిగా అర్థం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్‌ బోధనలో ఎప్పటికప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తల, వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్న పిల్లల సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని నగరానికి చెందిన ప్రముఖ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ సుబ్బయ్య స్పష్టం చేశారు.  

అంతరాలు పెరుగుతాయి  
రాజ్యాంగం కల్పించిన రైట్‌ టు ఎడ్యుకేషన్‌ హక్కును కార్పొరేట్‌ స్కూళ్లు కాలరాస్తున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో సమాజంలో అంతరాలను మరింత పెంచుతున్నాయి. ఈ విధానంతో సంపన్నులకే చదువుకునే అవకాశం ఉంటుంది. పేదలకు నష్టం వాటిల్లుతుంది. విద్యార్థుల మధ్య అంతరాలు పెంచుతున్న ఆన్‌లైన్‌ పాఠాలను నిషేధించాలి. ఈ అంశంపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం.  – వెంకట్, హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌అసోసియేషన్‌ ప్రతినిధి

సగం జీతాలతో.. ఫీజులెలా కడతాం?
మా కూతురు హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూళ్లో చదువుతోంది. వారం రోజులుగా ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతున్నారు. అప్పుడే ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు చెల్లించాలంటూ ఫోన్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో మా కంపెనీ సగమే జీతమే ఇస్తోంది. ఇలు గడవడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే ఫీజులు ఎలా చెల్లించగలం. ఆన్‌లైన్‌లో చెప్పే క్లాసులు అర్థం కావడం లేదు. ఏదైనా అనుమానం ఉంటే ఎవరూ నివృత్తి కూడా చేయడం లేదు. – ఓ స్టూడెంట్‌ తల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement