- దినేష్ ఘటనతో వెలుగు చూసిన వైనం
- నిందితుల కోసం ముమ్మర గాలింపు
- రంగంలోకి ప్రత్యేక బృందాలు
- దినేష్‌ది సాధారణ మరణమని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దినేష్ ఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ నడుస్తుందని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీసీఎస్ డీసీపీ పాల్‌రాజు తెలిపారు.
కాగా కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు దినేష్ పోస్టుమార్టం నివేదికలో అతనిది సాధారణ మరణ ం (గుండెపోటు) అని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక ఆపరేషన్‌కు ముందే గుండెపోటు వచ్చి చనిపోయాడా అనే విషయాలు ఆ నివేదికలో డాక్టర్లు పేర్కొనలేదని పాల్‌రాజు తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగానే..
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌తోనే దినేష్ సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని గట్టెక్కించేందుకు కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్న దినేష్.. రెండు నెలల నుంచి వేర్వేరుగా నాలుగు కిడ్నీ రాకెట్ ముఠాలతో సంప్రదింపులు జరిపాడు.
ఇందులో ఒక ముఠా బ్రోకర్ ప్రశాంత్ సేట్ తో సంప్రదించినట్లు అతని ఈ-మెయిల్ ద్వారా వెల్లడైంది. కానీ అది సంప్రదింపులకే పరిమితమైంది. దినేష్ కొలంబో వెళ్లడానికి కారణం.. మరో మూడు ముఠాలలో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న రాకెట్. ఈ ముఠా ఆదేశాల మేరకే దినేష్ కొత్తగూడెం నుంచి గత నెల 22న బయలుదేరి అదే రోజు హైదరాబాద్ చేరుకున్నాడు.
ఇక్కడ కిడ్నీ రాకెట్ ముఠాతో సంప్రదింపులు జరిపిన తరువాత అతను మరుసటిరోజు గుంటూరు వెళ్లాడు. అక్కడి నుంచి వెంకటేశ్వర్లు, కిషోర్‌లతో కలిసి చెన్నై వెళ్లి అక్కడి నుంచి కొలంబో వె ళ్లి మరణించాడు. అయితే హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ నిర్వాహకులు ఎవరు, వీరి మకాం ఎక్కడ అనే విషయాలపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అత్యంత విలువైన క్లూ లభించిందని, నిందితులను త్వరలో అరెస్టు చేసి మీడియా ముందు చూపిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లొంగిపోయిన నిందితుడు..?
దినేష్ మృతి, కిడ్నీ రాకెట్ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వ చ్చిన కథనాలపై గుంటూరుకు చెందిన కిషోర్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. దినేష్‌తో పాటు గో ట్రావెల్ బస్సులో కిషోర్ కూడా వెళ్లాడు. దినేష్ సెల్‌ఫోన్ కాల్‌లిస్టులో తన నెంబర్లు కూడా ఉంటాయని గ్రహించిన కిషోర్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని లొంగిపోయినట్లు తెలిసింది. ఇతనిచ్చిన సమాచారం మేర కే పోలీసులు సూత్రధారి కోసం వేట మొదలు పెట్టినట్లు తెలిసింది.
సంతకం పెట్టిన ఉన్నతాధికారి ఎవరు..?
దినేష్‌కు పాస్‌పోర్టు కేవలం 15 రోజుల్లోనే సమకూర్చారు. ఇదందా కిడ్నీ రాకెట్ బ్రోకరే చేయించాడు. ఇంత త్వరగా పాస్‌పోర్టు వచ్చే విధంగా చేశాడంటే అది కేవలం తత్కాల్ కింద దరఖాస్తు చేస్తేనే సాధ్యం. కాగా ఇలాంటి దరఖాస్తుపై దినేష్‌కు ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారి సర్టిఫై చేసి ఉండాలి. ఆ అధికారికి... కిడ్నీ వ్యాపారానికి సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ అధికారి దినేష్‌లాంటి వారికి ఎంతమందికి సంతకాలు పెట్టి ఉంటారోనన్న దిశగానూ విచారణ సాగుతోంది. ఈ రాకెట్‌లో పాస్‌పోర్టు అధికారుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.