సాక్షి, సిటీబ్యూరో: కిడ్నీ రాకెట్ లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. కిడ్నీ విక్రయించేందుకు కొలంబో వెళ్లి మృత్యువాత పడ్డ దినేష్ కేసు దర్యాప్తులో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగు చూసిందన్నారు. అదనపు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్ బి.మల్లారెడ్డి, డీసీపీ పాలరాజుతో కలిసి మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన దినేష్, పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన కిరణ్, కాశ్మీర్‌కు చెందిన అరాంజర్గర్‌లు కిడ్నీ అమ్మేందుకు ఫేస్‌బుక్, వెబ్‌సైట్ ద్వారా ప్రశాంత్‌సేఠ్‌ను సంప్రదించారు.
తరువాత వీరు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన వెంకటేశం(ఇతను కూడా కిడ్నీ ఇచ్చాడు), వనస్థలిపురానికి చెందిన ఎంబీఏ విద్యార్థి పవన్ శ్రీనివాస్ సహాయంతో గత నెల 23న కొలంబో వెళ్లారు. కిరణ్, అరాంజర్గర్‌కు కిడ్నీ తీసేందుకు డాక్టర్లు మార్చి 29వ తేదీని, దినేష్‌కు ఏప్రిల్ 1వ తేదీని ఖరారు చేశారు. అపరేషన్ తరువాత జల్సా చేయలేమనే ఉద్దేశంతో ఈ ముగ్గురు మార్చి 28న అక్కడి బీచ్‌లో మద్యం తాగగా దినేష్ వాంతులు చేసుకుని మృతి చెందాడు.
కొలంబోలో కిడ్నీకి రూ.50 లక్షలు
కిడ్నీ రాకెట్ సూత్రధారి ముంబ యికి చెందిన ప్రశాంత్‌సేఠ్ కొలంబోలో ఒక్కో కిడ్నీని రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తాడు. ఇక్కడి ఏజెంట్ల ద్వారా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమైన యువకులకు ఒక్కోక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇస్తాడు. యువలను తీసుకువచ్చిన ఏజెంట్లకు మాత్రం రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షలు వరకు చెల్లిస్తాడు. మిగిలిన సొమ్మును ప్రశాంత్‌సేఠ్, కొలంబోలోని డాక్టర్ మౌనిక్ పంచుకుంటారు. ఎంపికచేసిన యువకులకు ప్రశాంత్‌సేఠ్ ఇక్కడే రక్తపరీక్షలు చేసి ఆ నివేదికను కొలంబోలోని డాక్టర్ మౌనిక్‌కు చేరవేస్తే మౌనిక్ అవసరమైన రోగితో బేరం కుదుర్చుకుంటాడు.
ఆ తరువాతే ఇక్కడి నుంచి కిడ్నీ ఇచ్చేవారిని కొలంబోకు తీసుకెళ్తారు. వెంకటేశం ఆరుగురిని, శ్రీనివాస్ 15 మందిని ఇలా పంపించినట్లు తేలింది. ఇంకా ముంబ యి, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, హర్యానా కేంద్రాలుగా కిడ్నీ రాకెట్ నడుస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక కిడ్నీ అమ్మేందుకు వెళ్లే వారిని విజయవాడకు చెందిన సూర్యనారాయణ (ఇతను కూడా కిడ్నీ ఇచ్చినవాడే) బ్లాక్‌మెయిల్ చేసి అందినకాడికి దండుకునేవాడు. టూరిస్టు విసాపై వెళ్లిన యువకుల నుంచి కిడ్నీ తీసుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు త్వరలో ఒక పోలీసు బృందం శ్రీలంకకు పంపుతున్నట్టు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు.
కిడ్నీ రాకెట్‌లో ముగ్గురి అరెస్టు
Published Wed, Apr 23 2014 1:54 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement
Advertisement