సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని ఆరు చెరువులు డేంజర్‌జోన్‌లోకి చేరాయి. ప్రాణవాయువైన ఆక్సిజన్ మోతాదు అనూహ్యంగా పడిపోవడంతోపాటు హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందడంతో ఈ చెరువుల నీళ్లు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు సెంటర్‌ఫర్ క్లైమేట్ ఛేంజ్ అనే సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో కూకట్‌పల్లి పరికిచెర్వు, ఆర్‌కెపురం ముకిడిచెర్వు, నాచారం చెర్వు, ఉప్పల్ నల్లచెర్వు, మియాపూర్ పటేల్‌చెర్వు, గోల్కొండ ఇబ్రహీం చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల్లోకి సమీప గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి భారీగా మురుగునీరు చేరడంతో ప్రమాదకర బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు ఈ సంస్థ స్పష్టం చేసింది.
ఆరు చెరువుల దుస్థితి ఇదీ..
ఈ ఆరు చెరువుల్లోకి అత్యంత వేగంగా మురుగు నీరు వచ్చి చేరుతుండడంతోపాటు ఆయా నీటిలో హైడ్రోకార్బన్ మిశ్రమాలు అత్యధికంగా ఉండడం, సల్ఫేక్టెంట్ రసాయనాలు అధికంగా ఉండడంతో ఫిలమెంటస్ బ్యాక్టీరియా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో ఆయా చెరువుల్లో తరచూ మురుగునీరు తెల్లటినురగలు కక్కుతోంది. ఈ నీటిని తాకినవారికి చర్మ, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. సాధారణంగా చెరువుల నీటిలో సల్ఫెక్టెంట్ రసాయనం ఒక శాతానికి మించరాదు. కానీ ఆయా చెరువుల్లో 34 శాతంగా ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ చెరువుల్లో చేరే మురుగునీటిలో సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్‌లు అధికంగా ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
ఆక్సిజన్ భారీగా పడిపోయింది..
ఇక మహానగరం పరిధిలో మొత్తం 185 చెరువులుండగా..ఇందులో 17 చెరువుల్లో కరిగిన ఆక్సిజన్ శాతం దారుణంగా పడిపోయినట్లు పీసీబీ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న ఘన, ద్రవ వ్యర్థాలతోపాటు, బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న విషరసాయనాలు ఆయా చెరువుల్లోకి నేరుగా చేరడంతో పలు చెరువులు విషం చిమ్ముతున్నాయి. పీసీబీ ప్రమాణాల ప్రకారం ఆయా చెరువుల్లోని నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం ప్రతి లీటరు నీటిలో 4 మిల్లీగ్రాముల మేర ఉండాలి. కానీ పలు చెరువుల్లో 2 మిల్లీగ్రాముల కంటే తక్కువగా నమోదవడం గమనార్హం.
మురుగుతోనే అవస్థలు..
సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం..చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. చెరువుల ప్రక్షాళనకు జీహెచ్‌ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతనిస్తోంది. మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.
గ్రేటర్ పరిధిలో కాలుష్యకాసారంగా మారిన ఇతర చెరువులివే..
నల్లచెరువు, నూర్‌మహ్మద్‌కుంట, మల్లాపూర్, బంజారాలేక్, ప్రేమాజీపేట్, సరూర్‌నగర్, లంగర్‌హౌజ్, సఫిల్‌గూడా, హస్మత్‌పేట్ చెర్వు, హుస్సేన్‌సాగర్, మీరాలం చెర్వు, అంబీర్‌చెర్వు, కాప్రా చెర్వు, రంగధాముని చెర్వు, ప్రగతినగర్, ఫాక్స్‌సాగర్.్ట
Comments
Please login to add a commentAdd a comment