మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్‌నూ ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నగరాల కంటే మన మెట్రో ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. ఒకే పిల్లర్‌పై ట్రాక్, స్టేషన్ల నిర్మాణం, డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ, ప్రీకాస్ట్ విధానం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నిర్మాణమవుతోంది. అంతేకాదు పలు మెట్రో నగరాల్లో తొలివిడతగా 5 లేదా పది.. గరిష్టంగా 20 కి.మీ. మాత్రమే మెట్రో రైళ్లు తొలి విడతగా పట్టాలెక్కాయి. మన సిటీలో మాత్రం ఈనెల 28న 30 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీయనుండడం విశేషం.
మహానగరాల ప్రజా రవాణా వ్యవస్థల్లో మెట్రో రైళ్ల శకం పరుగులు పెడుతోంది. ఆయా సిటీల్లో లక్షలాది మంది సాధారణ ప్రజల(ఆమ్ ఆద్మీలు) రోజువారీగా ఏసీ బోగీల్లో సౌకర్యవంతమైన ప్రయాణం, ట్రాఫిక్ నరకం లేకుండా గమ్యం చేర్చేందుకు తనకేవీ సాటిరావని మెట్రో రైళ్లు రుజువు చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై తదితర మహానగరాల్లో ఇప్పుడు మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటన్నింటి కంటే మన మెట్రోనే భిన్నంగా నిర్మాణమవుతోంది. ఈ తరుణంలో పలు మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టుల విశేషాలపై ప్రత్యేక కథనం.
ఢిల్లీలో ఇలా మొదలైంది..
♦ 1998 అక్టోబరులో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభం.
♦ 2002 డిసెంబరులో 25 కి.మీ. మార్గంలో తొలిదశ అందుబాటులోకి..
♦ ప్రస్తుతం 218 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి..
♦ నిత్యం ఆరు మార్గాల్లో 24 లక్షలమంది మెట్రో రైళ్లలో ప్రయాణం.
♦ డీఎంఆర్‌సీ సంస్థ ఈ పనులను చేపట్టింది.
ముంబై నగరంలో ఇలా..
♦ మెట్రో రైళ్లలో రోజువారీగా 2.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
♦ ప్రస్తుతం 11.4 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
♦ తొలిదశ మెట్రో పనుల పూర్తికి 8 సంవత్సరాల సమయం పట్టింది.
♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మాణం పనులు మొదలయ్యాయి.
బెంగళూరులో..
♦ 2015 మేలో ప్రాజెక్టు ప్రారంభమైంది
♦ 42.30 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.
చెన్నైలో శ్రీకారం ఇలా..
♦ చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు పనులు
♦ 2009 జూన్‌లో ప్రారంభమయ్యాయి
♦ జూన్ 29, 2015 నాటికి తొలిదశ పూర్తయింది.
♦ తొలిదశలో కోయంబేడు– ఆలందూర్ మధ్య 27 కి.మీ. మార్గంలో 27 రైళ్లు పరుగులు.
♦ నిత్యం 3లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు.
♦ మొత్తం 45 కి.మీ. మార్గంలో పనులు చేపడుతున్నారు. ఇందులో 21 కి.మీ. మేర ఎలివేటెడ్ (ఆకాశమార్గం), మరో 24 కి.మీ భూగర్భ మార్గంలో సాగుతున్నాయి.
♦ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,750 కోట్లు
హైదరాబాద్ ప్రాజెక్టు ఇలా..
♦ 2012 జూన్‌లో మెట్రో పనులు ప్రారంభమయ్యాయి.
♦ ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఫలక్‌నుమా, నాగోల్– శిల్పారామం రూట్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు సాగుతున్నాయి.
♦ తొలి దశలో ఈనెల 28న 30 కి.మీ మార్గంలో రైళ్లు పరుగులు తీయనున్నాయి.
♦ 2018 డిసెంబరు నాటికి మొత్తం 72 కి.మీ. మార్గం అందుబాటులోకి రానుంది.
♦ ప్రారంభంలో సుమారు 16 లక్షలు, 2020 నాటికి 24 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా.
♦ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,000 కోట్లు. ఇందులో కేంద్రం 10 శాతం, మరో 90 శాతం ఎల్‌అండ్‌టీ సంస్థలు ఖర్చు చేస్తున్నాయి. మరో రూ.1980 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, రహదారుల విస్తరణకు వ్యయం చేస్తోంది.
♦ ప్రతి రైలులో మూడు బోగీలుంటాయి. వెయ్యి మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
♦ మొత్తం మూడు కారిడార్లలో 57 మెట్రో రైళ్లు 72 కి.మీ. మార్గంలో రాకపోకలు సాగిస్తాయి.
♦ మియాపూర్, ఉప్పల్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మూడు మెట్రో రైలు డిపోలు ఏర్పాటు.
♦ మూడు కారిడార్లలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్లను ఉప్పల్ మెట్రో డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ కేంద్రం నుంచి నియంత్రిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment