జిన్నా శ్రీకాంత్ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: పోలీసుల అలసత్వం... దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం... విచారణలో లోపం... వెరసి జిత్తులమారి జిన్నా కాంతయ్య ‘ఎదగడానికి’ ఉపకరించాయి. 2007లో మోసాలకు శ్రీకారం చుట్టిన ఇతగాడు నిరాటంకంగా చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదైనా ఒక్కదాంట్లోనూ శిక్ష పడకపోవడం, సరైన నిఘా లేని కారణంగానే ఉప్పల్ కేంద్రంగా గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో పల్లీ నూనె మిషన్ల దందాకు పాల్పడ్డాడు. దీని ముసుగులో నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడి రూ.కోట్లలో దండుకున్నాడు. ఇకనైనా పోలీసులు కళ్లు తెరవకపోతే భవిష్యత్తులో మరిన్ని ‘అవతారాలు’ ఎత్తే ప్రమాదం ఉందనేది నిర్వివాదాంశం.
కాలానుగుణంగా మోసాలు...
ఘరానా మోసగాడు కాంతయ్య అలియాస్ శ్రీకాంత్ 12 ఏళ్లుగా ఎప్పటికప్పుడు డిమాండ్ ఉన్న వ్యవహారాన్ని తీసుకుని మోసాలు చేస్తున్నాడు. 2007లో రియల్ ఎస్టేట్‌బూమ్ జోరుగా ఉన్న సమయంలో మహాలైఫ్ ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఆపై మహాలైఫ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా మార్చి మరికొన్ని వ్యవహారాలు సాగించాడు. రియల్ వ్యాపారం తగ్గి ఆర్గానిక్ ఉత్పత్తులపై జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో గ్రీన్‌గోల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో మోసానికి తెరలేపాడు. ప్లాస్టిక్‌పై నిషేధం ప్రకటన వచ్చిన తరవాత పేపర్ బ్యాగ్స్ తయారీ యంత్రాలు అంటూ జిన్నా ట్రేడింగ్ కంపెనీ పేరుతో మరో మోసానికి తెరలేపాడు. ఇన్ని రకాలుగా సంస్థలు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడిన ఇతడిపై సైబరాబాద్, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కడప జిల్లాతో కలిపి మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి. తాజాగా ఉప్పల్‌లో తొమ్మిదో కేసు నమోదైంది.
అడ్రస్ మారుస్తూ ‘సేఫ్‌జోన్’లోకి...
ఘరానా మోసగాడు కాంతయ్య ఒక్కో తడవకు ఒక్కో పేరుతో రూ.కోట్లు దండుకుంటున్నాడు. అయినా స్నాచర్లు వంటి సొత్తు సంబంధ నేరగాళ్లపై ఉన్న నిఘా ఇలాంటి జిత్తులమారులపై ఉండట్లేదు. ఓసారి అరెస్టైన తర్వాత బెయిల్ పొందే ఇతగాడు తన మకాం మార్చేస్తుండటం యథేచ్ఛగా మోసాలు చేయడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఏదైనా కేసులో నిందితుడు కోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వస్తే... వాయిదాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అలా చేయని వారిపై న్యాయస్థానాలు వారెంట్లు జారీ చేస్తాయి. వీటిని ఎగ్జిక్యూట్ చేయాల్సిన పోలీసులు చిరునామా మార్చాడన్న కారణం చూపిస్తూ తదుపరి చర్యలు తీసుకోవట్లేదు. ఫలితంగానే మహాలైఫ్ హోమ్స్, మహాలైఫ్ పబ్లికేషన్స్, మహాలైఫ్ క్లినిక్, మహాలైఫ్ మీడియా ఇంక్, మహాలైఫ్ ఇన్నో మార్కెట్స్ ఇంక్, మహాలైఫ్ హోమ్స్ (రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్), గ్రీన్ గోల్డ్ బయోటెక్ తదితర సంస్థల ముసుగులోనూ మోసాలు చేయగలిగాడు.
‘ముందస్తు’ను పట్టించుకోక...
పలు సంస్థల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన శ్రీకాంత్‌ను విచారించడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. ఇతగాడికి గతంలో కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఇలా బెయిల్ ఇచ్చే న్యాయస్థానాలు దర్యాప్తు అధికారులకు పూర్తి సహకారం అందించాల్సిందిగా షరతు విధిస్తాయి. అయితే రెండు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఎగ్జిక్యూట్ చేసిన అప్పటి సీసీఎస్ పోలీసులు ఈ విషయం పట్టించుకోలేదు. కేవలం ఓసారి మాత్రమే పిలిపించి పంపించేయడంతో అనేక అంశాలు మరుగున పడిపోయాయి. మరోపక్క ఒక్కో స్కామ్‌లో వందల మంది బాధితులు ఉన్నా పోలీసులు కేవలం ఐదు నుంచి పది మందిని మాత్రమే సాక్షులుగా పేర్కొంటున్నారు. వీరితో కాంప్రమైజ్ అవుతున్న కాంతయ్య తేలిగ్గా తప్పించుకుంటున్నాడు. బాధితులు అందరినీ బాధితులుగా/సాక్షులుగా చేరిస్తే ఈ పరిస్థితులు ఉండేవి కాదని వినిపిస్తోంది. అంతా చెప్పేది ఒకే అంశం అని భావిస్తూ కొందరు, నిందితులకు పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశంతో మరికొందరు బాధితులు/సాక్షుల సంఖ్యను తగ్గించేసి కేసులను కాంతయ్యకు అనుకూలంగా మార్చేశారు.
దర్యాప్తు సమర్థంగా ఉన్నప్పటికీ...
‘తిలాపాపం తలాపిడికెడు’ అన్న చందంగా అనేక మంది చేసిన పోరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యల కారణంగానే ఈ ‘పల్లీ మొక్క’ మానుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గతంలో కాంతయ్యపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన అధికారులు కొన్ని ఆస్తులను గుర్తించి అటాచ్‌మెంట్‌కు చర్యలు తీసుకున్నారు. అయితే సాక్షులు, బాధితుల్ని మభ్యపెట్టిన అతగాడు న్యాయస్థానం నుంచి వాటిని రిలీవ్ చేయించుకుంటున్నా దర్యాప్తు అధికారుల చేష్టలుడిగి చూశారు. కొన్ని కేసుల్లో పోలీసుల దర్యాప్తు పక్కాగా ఉన్నప్పటికీ తీవ్రతను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంలో ఉన్న లోపాలు అతడికి కలిసి వచ్చాయి. ఇలాంటి అనేక లోపాల నేపథ్యంలోనే కాంతయ్య ఏళ్లుగా మకాం మారుస్తూ నిరాటంకంగా మోసాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా పట్టుకున్న రాచకొండ పోలీసులైనా లోపాలకు తావు లేకుండా దర్యాప్తు చేపట్టి ఉక్కుపాదం మోపితేనే ఇతడి ఆగడాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment