ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లకు బ్రేక్‌! | Hyderabad Police Orders to NGOs No Free Oxygen Cylinders | Sakshi
Sakshi News home page

ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లకు బ్రేక్‌!

Published Tue, Jul 14 2020 8:17 AM | Last Updated on Tue, Jul 14 2020 11:51 AM

Hyderabad Police Orders to NGOs No Free Oxygen Cylinders - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో అత్యవసరం ఉన్న నిరుపేద రోగులకు అందజేస్తున్న ‘ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్ల’ ప్రక్రియకు బ్రేక్‌ పడింది.  నగరంలోని గోల్కొండలో ఎలాంటి లైసెన్స్, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకుండా కొనసాగుతున్న అక్రమ ఆక్సిజన్‌ సిలిండర్ల దందా బయటపడటంతో మిగతా చోట్ల ఆక్సిజన్‌ సిలిండర్ల నిల్వలపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. అందులో భాగంగా పలు ఎన్జీవోలు, దాతలకు సైతం ‘ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ నిలిపివేయాలని స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందాయి. నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లను నిల్వ ఉంచితే ఎక్స్‌ప్లోజివ్‌ చట్టం, జాతీయ విపత్తు నిర్వాహణ చట్టం కింద కేసులు నమోదు  తప్పదని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. కరోనా బారినపడి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తుతుండటంతో వారికి ఆక్సిజన్‌ అందించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆక్సిజన్‌ సిలిండర్ల దందాకు తెరలేపడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం
ఎక్స్‌ప్లోజివ్‌ చట్టం నిబంధలను కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. కరోనా కేసుల్లో ఆక్సిజన్‌ అందక బాధితుల ప్రాణాలు పోతుంటే.. ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీకి కూడా ఎక్స్‌ప్లోజివ్‌ చట్టం వర్తింపజేయడం విస్మయానికి గురిచేస్తోంది.

ఆక్సిజన్‌ అందక..
హైదరాబాద్‌ మహా నగరంలో కరోనా బారిన పడిన వారిలో అత్యధికంగా ఊపిరి ఆడక మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్ల తీవ్ర కొరత ఉండగా, ఇక ఇంటి వద్ద ఉండి చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మెడికల్‌ ఆక్సిజన్‌ ధరలు అందుబాటులో లేకుండా పోయాయి.  దీంతో కొన్ని ఎన్జీవో సంస్థలు, మసీదులు ముందుకు వచ్చి దాతల ఆర్థిక చేయూతతో అత్యవసరం ఉన్న  నిరుపేదరోగులకు ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లపంపిణీకి శ్రీకారం చుట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 15 రోజులుగా ఉచిత సిలిండర్ల పక్రియ కొనసాగింది. కొన్ని ఎన్జీవోలైతే ఏకంగా తమ వాహనాల్లోనే బాధితుల ఇళ్ల్ల వద్దకు సైతం సిలిండర్లు, దానికి సంబంధించిన పరికరాలను చేరవేశాయి. ఆయా ఎన్జీవో సంస్థలు, సామాజిక సేవకులు, మసీదు కమిటీలు, దాతలు సోషల్‌ మీడియాలో ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్ల పోస్టు పెట్టడంతో  స్పందన లభించింది. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు దాతలు సైతం ఉచిత సిలిండర్లపంపిణీకి ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలతో కూడుకున్న పని కావడంతో పేదలకు ఇంటి వద్దకే ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేయడంతో ఉపశమనం కలిగింది. తాజాగా ఉచిత సిలిండర్ల పంపిణీ నిలిపివేతతో నిరుపేదలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.  

అత్యవసరం
విషమ పరిస్థితుల్లో గల రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లు అత్యవసరంగా మారాయి. డిమాండ్‌కు తగ్గ సిలిండర్లు అందుబాటులో లేక మార్కెట్లో ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు  ‘మెడికల్‌ ఆక్సిజన్‌’ కొరత ఇబ్బందిగా మారింది. ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత సమస్యగా మారింది. పాజిటివ్‌ వచ్చిన వారిని హోమ్‌ ఐసోలేషన్‌కు పరిమితం చేయడంతో బహిరంగ మార్కెట్‌లో మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెరిగినట్లయింది. వాస్తవంగా ఆక్సిజన్‌ సిలిండర్ల ఉత్పత్తి చేసే సంస్థలు, కంపెనీలకు కూడా డిమాండ్‌కు తగ్గ సరఫరా తలకు మించిన భారంగా తయారైంది. రీఫిల్‌ చేయడానికి ఖాళీ సిలిండర్ల కొరత కూడా వెంటాడుతోంది. కరోనా రోగుల తాకిడిని తట్టుకునేందుకు ఏకంగా ఐసీఎమ్‌ఆర్‌ నిబంధనల మేరకు.. పాజిటివ్‌ పేషంట్లను ఇళ్లకు పరిమితం చేస్తూ ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవాలని అధికారులు పేర్కొనడం విస్మయంకలిగిస్తోంది.

ఆక్సిజన్‌ టెన్షన్‌..
హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం చేయించుకుంటున్న రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లటెన్షన్‌ వెంటాడుతోంది. కరోనా ప్రాథమిక స్థాయిలో ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఆక్సిజన్‌ పెట్టాల్సి వస్తే.. తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన అధికమైంది. ఓల్డేజ్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు కరోనా వైరస్‌తో కొద్ది రోజుల వ్యవధిలో చనిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా ఊపిరి అందకపోవడమే కారణంగా తెలుస్తోంది. దీంతో ముందస్తుగా ఆక్సిజన్‌ సిలిండర్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుండంతో మెడికల్‌ ఆక్సిజన్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు ఆక్సిజన్‌ సిలిండర్లు, మిషన్లు అద్దెకు తీసుకుంటున్నారు. మరికొంత మంది రేటు ఎక్కువైనా వీటిని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.. ఆక్సిజన్‌ సిలిండర్స్, మెషిన్స్‌తోపాటు పల్స్‌ ఆక్సీ మీటర్స్‌ కూడా విపరీతంగా డిమాండ్‌ పెరిగినట్లయింది. 

సిలిండర్ల ధర ఇలా...
సిలిండర్ల ధర ఇష్టానుసారంగా తయారైంది. సాధారణంగా 10 కిలోల సిలిండర్‌ ధర రూ.7 వేల నుంచి రూ.8 వేల రూపాయలుంటే.. ప్రస్తుతం రూ.10 వేలకు పైగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా లభించని పరిస్థితి. 12 కిలోల సిలిండర్‌ రూ.10 నుంచి రూ.12 వేలు ఉంటే ప్రస్తుతం రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. 10 కిలో సిలెండర్‌తో 8 గంటలు, 12 కిలోల సిలెండర్‌తో 10 గంటల పాటు రోగికి ఆక్సిజన్‌ అందించే అవకాశం ఉంటుంది. సిలిండర్‌ పూర్తయ్యే సరికి రీఫిల్‌ సిద్ధంగా ఉండాలి. కనీసం రెండు సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఖాళీ సిలిండర్‌ రీఫిలింగ్‌ సమస్యగా తయారైంది. సిలిండర్ల  రీఫిలింగ్‌కు రెండు, మూడు రోజులు పడుతోంది. మరోవైపు పవర్‌తో నడిచే ఆక్సిజన్‌ మెషిన్స్‌ 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు ఉంటాయి. రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు ధర పలుకుతోంది. ఆక్సిజన్‌ సిలిండర్‌ కంటే మెషిన్‌ అయితే డిస్పోజబుల్‌ క్యాప్‌ వల్ల అందరూ వినియోగించుకునే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement