8 నిమిషాలు! సిటీ పోలీసు రెస్పాన్స్‌ టైమ్‌ ఇదీ | Hyderabad Police Response Timing Story | Sakshi
Sakshi News home page

8 నిమిషాలు!

Published Mon, Sep 2 2019 7:28 AM | Last Updated on Wed, Sep 4 2019 12:49 PM

Hyderabad Police Response Timing Story - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఓ నేరం బారినపడిన, సహాయం అవసరమైన వ్యక్తి నుంచి పోలీసులకు ఫోల్‌ కాల్‌ వచ్చినప్పుడు ఎంత తొందరగా వారి వద్దకు చేరుకోగలిగితే... అంత తక్కువ నష్టం, ఎక్కువ మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో  ‘పోలీస్‌ రెస్పాన్స్‌ టైమ్‌’ అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం... వీలైనంత తక్కువ సమయంలో ఘటనాస్థలికి చేరుకోవడం... నేరాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్‌ జరిగేలా చూడటం... ఈ లక్ష్యాలే ప్రధాన అజెండాగా రక్షక్, బ్లూకోల్ట్స్‌లకు ‘హైదరాబాద్‌ రెస్పాన్స్‌ టైమ్‌’ నిర్థారిస్తున్నారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను ‘డయల్‌–100’తో అనుసంధానించారు. నగరంలో మొదటి ఆరు నెలలకు సంబంధించి ఈ రెస్పాన్స్‌ టైమ్‌ సగటున ఎనిమిది నిమిషాలుగా ఉంది. టాప్‌టెన్‌ ఠాణాల్లో ఉన్న పంజగుట్ట 3.26 నిమిషాలు, నారాయణగూడ 3.39 నిమిషాలు, అబిడ్స్‌ పోలీసులు 3.57 నిమిషాలుగా నమోదైంది.  

ఒకప్పుడు ఇలా...
నగరంలోని బాధితుడెవరైనా సహాయం కోసం ‘100’కు ఫోన్‌ చేస్తే... అది నేరుగా ఈఎంఆర్‌ఐ ఆధీనంలో ఉన్న ‘డయల్‌–100’కు చేరుకునేది. అక్కడి సిబ్బంది విషయం తెలుసుకుని.. బాధితుడు ఏ ఠాణా పరిధిలోకి వస్తాడో వాకబు చేసేవారు. ఆ తర్వాత సదరు ఫోన్‌ కాల్‌లోని అంశాలను టెక్టŠస్‌గా మార్చి బాధితుడున్న ప్రాంతం పరిధిలోకి వచ్చే ఠాణాతో పాటు జోన్‌ కార్యాలయం, కమిషనరేట్‌కు చెందిన ప్రధాన కంట్రోల్‌ రూమ్‌లోని కంప్యూటర్లకు పంపేవారు. దీంతోపాటు వాకీటాకీ ద్వారానూ సందేశం ఇవ్వడం ద్వారా గస్తీ వాహనాలను అప్రమత్తం చేసేవారు. ఈ సమాచారం అందుకునే గస్తీ సిబ్బంది ఎక్కడ ఉన్నారు? బాధితుడికి ఎంత దూరంలో ఉన్నారు? తదితర అంశాలు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. దీంతో ఆయా గస్తీ వాహనాల్లోని సిబ్బంది చెప్పిన అంశాల పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఫలితంగా గస్తీ వాహనం బాధితుడి వద్దకు చేరే సమయం చాలా ఎక్కువగా ఉండేది. కొన్నిసార్లు అరగంట, గంట కూడా పట్టేది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పాటు నేరస్తులు తప్పించుకునేవారు.   

‘100’ కార్యకలాపాలు హైటెక్‌గా...
గస్తీ సిబ్బందికి సైతం  ట్యాబ్స్‌ అందించారు. వీటి ఆధారంగా ‘డయల్‌–100’ను గస్తీ వాహనాలతో అనుసంధానించారు. ఫలితంగా రెస్పాన్స్‌టైమ్‌ గణనీయంగా తగ్గడం తోపాటు సాంకేతికత పెరిగింది.

ప్రస్తుతం ఇలా...
ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు ‘100’కు ఫోన్‌ చేసి సçహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు.  
ప్రతి గస్తీ వాహనంలో ఉన్న ట్యాబ్‌లోని జీపీఎస్‌ ఆధారంగా ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్‌ తెర ద్వారా కచ్చితంగా తెలుస్తోంది.  
దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్‌కా ల్‌ను మళ్లిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం కేవలం కొన్ని సెకన్లలో పూర్తవుతుంది.  
పెట్రోలింగ్‌ వాహనాల్లో ఉండే సిబ్బంది ఫోన్లకు ‘100’ నుంచి డైవర్డ్‌ అయిన కాల్‌ వస్తే... ప్రత్యేక రింగ్‌టోన్‌ వస్తుంది. ఫోన్‌ ఎక్కడి నుంచి అనేది తేలిగ్గా తెలియడం కోసం అన్ని వాహనాల్లోని సిబ్బందికీ ఇలాంటి టోన్‌ ఏర్పాటు చేశారు.
ఫోన్‌ ఎత్తిన వెంటనే అతడి ట్యాబ్‌ తెరపై ఓ నోటిఫికేషన్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితుడు/ఫిర్యాదుదారుడికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నది కనిపిస్తాయి. గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్‌’ అనే బటన్‌ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్లు ఎక్నాలెడ్జ్‌ చేస్తారు.  
ఒకసారి ఎక్నాలెడ్జ్‌ చేసినప్పటి నుంచి ‘రెస్పాన్స్‌ టైమ్‌’ లెక్కింపు ప్రారంభమవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకునే గస్తీ వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందిస్తున్నాయి.  
ఏదైనా ప్రమాదం జరిగినట్‌లైతే క్షతగాత్రుల కు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు మొత్తం వ్యవహారాన్ని ఆధారాల కోసం ఫొటోలు తీసుకుంటున్నారు.  
పబ్లిక్‌ ప్లేసుల్లో జరిగే గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదుపై స్థానిక పోలీసు అధికారుల్ని అప్రతమత్తం చేయడంతో పాటు ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి తదుపరి చర్యలు చేపడుతున్నారు.
సహాయక చర్యలు, తదుపరి యాక్షన్స్‌ తీసుకోవడం పూర్తయిన వెంటనే సదరు ఫొటో లు, వీడియోలను ఆన్‌లైన్‌ ద్వారానే సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు పంపిస్తారు.  
ఈ తంతంగాలన్నీ పూర్తయిన తర్వాత తొలుత వచ్చిన నోటిఫికేషన్‌ను మళ్లీ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. అందులో ఉండే  ‘కాల్‌ క్లోజ్‌’ బటన్‌ నొక్కడంతో ‘రెస్పాన్స్‌ టైమ్‌’ పూర్తవుతుంది.  
ఫోన్‌ కాల్‌ వచ్చిన దగ్గర నుంచి ఆద్యంతం జరిగే ప్రతి అంకం ‘డయల్‌–100’తో పాటు కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్, జోనల్‌ కార్యాలయాలకు చేరుతాయి. కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది ప్రతి ఉదంతానికి సంబంధించిగస్తీ వాహనాలు ‘రిసీవ్డ్‌’ బటన్‌ నొక్కడానికీ, ‘కాల్‌ క్లోజ్డ్‌’ బటన్‌ నొక్కడానికి మధ్య కాలాన్ని లెక్కిస్తారు.  
ఇలా ఏ వాహనానికి ఆ వాహనం ‘రెస్పాన్స్‌ టైమ్‌’తో పాటు నగర వ్యాప్తంగా అన్ని వాహనాల సరాసరిని తీసుకుంటూ ‘హైదరాబాద్‌ రెస్పాన్స్‌ టైమ్‌’ను నిర్థారిస్తున్నారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు లెక్క.  
రెస్పాన్స్‌ టైమ్‌ ఎక్కువగా తీసుకున్న వాహనాల్లోని సిబ్బందిని జవాబుదారీ చేస్తున్నారు. ఆలస్యానికి కారణం ఏంట న్నది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

‘రెస్పాన్స్‌’లో టాప్‌టెన్‌ ఠాణాలివీ..
పోలీసుస్టేషన్‌    రెస్పాన్స్‌ టైమ్‌

పంజగుట్ట           3.26 నిమిషాలు
నారాయణగూడ   3.39 నిమిషాలు
అబిడ్స్‌              3.57 నిమిషాలు
ఫలక్‌నుమ         4.04 నిమిషాలు
ఛత్రినాక             4.12 నిమిషాలు
బంజారాహిల్స్‌     4.47 నిమిషాలు
ఎస్సార్‌నగర్‌       5.51 నిమిషాలు
గాంధీనగర్‌         6.46 నిమిషాలు
కంచన్‌బాగ్‌        7.29 నిమిషాలు
బేగంపేట           7.44 నిమిషాలు
సిటీ యావరేజ్‌    8 నిమిషాలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement