
విద్యుద్దీపాల కాంతుల్లో తెలుగు తల్లి ఫ్లై ఓవర్
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు నగరం సిద్ధమైంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారసత్వ భవనాలు, ముఖ్య కూడళ్లు, ఫ్లై ఓవర్లు, పార్కులు, జాతీయ నేతల విగ్రహాలు, సెంట్రల్ మీడియన్లను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. గన్‌పార్క్, దాని పరిసర ప్రాంతాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 191 ప్రదేశాల్లో విద్యుత్ దీప కాంతులకు దాదాపు రూ.1.32 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలను కూడా అలంకరించనున్నారు.
వివిధ జంక్షన్లలో 400 వాట్స్ 217 కలర్ లైట్లు, వెయ్యి వాట్స్ 204 హాలోజెన్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు 38/ 64/120 వాట్స్ 3,207 ఎల్‌ఈడీ పార్‌క్యాన్స్‌తో ప్రత్యేక రంగులు ప్రసరింపచేయనున్నారు. పార్ క్యాన్స్‌ను పార్కులు, ట్రాఫిక్ ఐలాండ్లు తదితర ప్రాంతాల్లో మొక్కల దిగువన ఏర్పాటు చేయడంతో రంగుల వెలుతురు పైకి ప్రసరించి ప్రత్యేకంగా కనిపిస్తుందని జీహెచ్‌ఎంసీ విద్యుత్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుమాధవ్ తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి 3వ తేదీ వరకు దీపకాంతులతో నగరం ప్రత్యేకంగా కనిపించనుంది.
బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో..
బయో డైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో గన్‌పార్కులో పూలతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ఈ సీజన్‌లో లభించే బంతి, వింకారోజియా, కాశ్మీర్ రోజెస్‌తో అమరవీరుల స్తూపాన్ని తీర్చిదిద్దనున్నట్లు బయోడైవర్సిటీ విభాగం అడిషనల్ కమిషనర్ కృష్ణ తెలిపారు.