నీ కీర్తి.. సదా స్ఫూర్తి
పాలమూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పలుచోట్ల జయంతి కార్యక్రమాలు జరిగాయి. ‘వైఎస్‌ఆర్ అమర్హ్రే.. రైతుబంధువు జోహార్’ అంటూ అంజలి ఘటించారు.
రైతుల కోసం నిరంతరం తపించి వ్యవసాయానికి వన్నె తెచ్చిన వైఎస్ జన్మదినాన్ని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించాలని పలువురు నేతలు డిమాం డ్ చేశారు. నీకీర్తి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ జిల్లా కార్యాల యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి మెట్టుగడ్డ సమీపంలో ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాల, ఏనుగొండలో ఉన్న రెడ్‌క్రాస్ అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు.
జిల్లావ్యాప్తంగా
వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి భగవంతురెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కల్వకుర్తిలో నగర పంచాయతీ వైస్‌చైర్మన్ షాషెద్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.
జడ్చర్లలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ నాయకుడు పాండునాయక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. అచ్చంపేట మండలంలో పార్టీ మండల కన్వీనర్ కొండూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. బొమ్మన్‌పల్లిలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం అక్కడి లెనిటి ఫౌండేషన్ అనాథవృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. షాద్‌నగర్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముఖ్య కూడలిలో ఉన్న వైఎస్ విగ్రహనికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోన దేవయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించి..వేడుకలు జరుపుకున్నారు. నర్వ మండలంలోని నర్వ, లంకాల, జిన్నారం, కన్మనూర్, జంగంరెడ్డిపల్లి, కల్వాల, యాంకి గ్రామాల్లో జయంతి కార్యక్రమాలు జరిగాయి. నారాయణపేటలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జమీర్‌పాషా, పట్టణ అధ్యక్షులు యూసుఫ్‌తాజ్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొత్తకోట మండలం అజ్జకొల్లు గ్రామంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. గోపాల్‌పేట మండలకేంద్రంలో వైఎస్ అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ నేతలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
మహబూబ్‌నగర్ అర్బన్: జడ్చర్లలో కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి నిత్యానందం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునిసిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని స్థానిక మునిసిపల్ చైర్‌పర్సన్ సి.రాధాఅమర్ కొనియాడారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఆమె మహబూబ్‌నగర్ పట్టణంలోని స్థానిక వైఎస్‌ఆర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన సంక్షేమ పథకాలలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని కొనియాడారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాలప్రకాశ్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ఆయన ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా జిల్లా నుంచే ప్రారంభించే వారని గుర్తుచేశారు.