
ఆ డబ్బెక్కడిదో.. నాకేమీ తెలియదు!
ఏసీబీ అధికారుల ప్రశ్నలకు రేవంత్ అడ్డగోలు సమాధానాలు
పూసగుచ్చినట్లు వివరాలు వెల్లడించిన సెబాస్టియన్, ఉదయ సింహ
సాక్షి, హైదరాబాద్: ‘మేం ఎమ్మెల్సీని గెలవాలె. మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎట్ల తనవైపు తిప్పుకున్నడో అట్లనే మేం కూడా టీఆర్‌ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కన్నేసినం. తెలుగుదేశానికి ఓటేస్తె భవిష్యత్ బాగుంటదని చెప్పినం. స్టీఫెన్‌సన్ మాకు టచ్‌లోకి వస్తెనే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడిన..’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. కానీ స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు.
ఆదివారం కేసు పరిశోధనాధికారి అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు నిందితులను విడివిడిగా ప్రత్యేక గదుల్లో నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రేవంత్‌తో పాటు పట్టుబడిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చి పంపించారనే దానిపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అధికారులు తరచూ మారుతూ.. ‘ఆయన అలా చెప్పారు. నువ్వి లా చెబుతున్నావేంటి?’ అంటూ వారి నుంచి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
జానారెడ్డి మీకెందుకు సాయం చేశారు?: కాంగ్రెస్ నేత జానారెడ్డితో సన్నిహిత సంబంధాల గురించి అధికారులు రేవంత్‌ను ప్రశ్నించారు. జానారెడ్డి రాజకీయంగా తెలుసని రేవంత్ చెప్పగా.. ‘మరి 2009 ఎన్నికల్లో జానారెడ్డి మీకు ఆర్థికంగా ఎందుకు సాయపడ్డార’ని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. 2009 ఎన్నికల గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారని రేవంత్ ఎదురు ప్రశ్నించారని, దాంతో ‘అది నిజమా కాదా?’ అని అధికారులు నిలదీయగా రేవంత్ అడ్డంగా తలూపారని తెలుస్తోంది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి రేవంత్ సాగించిన భూ దందాలు, ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులు సాగించిన సెటిల్‌మెంట్ల విషయాన్ని ప్రశ్నించి నట్లు తెలిసింది.
పలు కీలక వివరాలు వెల్లడి..
రెండో రోజు ఏసీబీ విచారణలో రేవంత్ సరైన సమాధానాలు చెప్పకుండా సతాయించగా.. మిగతా నిందితులు టీడీపీ క్రిస్టియన్ విభాగంలో ముఖ్యనేతగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ మాత్రం డబ్బు విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించినట్లు సమాచారం. రేవంత్‌తో తనకున్న పరిచయం, మత్తయ్య ద్వారా స్టీఫెన్‌సన్‌ను కలిసి డీల్ మాట్లాడిన విషయాలను సెబాస్టియిన్ ఏసీబీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. తానో చిన్న నాయకుడినని, తనకు అండగా ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పాకే స్టీఫెన్‌సన్‌తో సంప్రదింపులు జరిపానని చెప్పినట్లు సమాచారం. అలాగే స్టీఫెన్‌సన్ వద్దకు డబ్బుల బ్యాగు తెచ్చిన ఉదయసింహ కూడా తనకు డబ్బు ఎవరి ద్వారా వచ్చిందో అధికారులకు వివరించినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రకారమే తాను నడి చానని, తనకు రూ.50 లక్షలు సొంతంగా సంపాదించే శక్తి లేదని కూడా ఒప్పుకొన్నట్లు సమాచారం.
అయితే వీరిద్దరు చెప్పిన మాటల ప్రకారం రేవంత్‌ను అధికారులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియదనే బుకాయించినట్లు తెలిసింది. బాస్ చంద్రబాబు డబ్బులు పంపించారా? అని అధికారులు అడగగా.. డబ్బు గురించే తనకు తెలియదన్నప్పుడు బాబు గురించి ఎందుకడుగుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తంగా రెండో రోజు విచారణ అనంతరం ఏసీబీ అధికారులకు కేసు విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులు పంపించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
సౌకర్యాలు కల్పించడం లేదు
ఏసీబీ అధికారులపై రేవంత్‌రెడ్డి న్యాయవాదుల ఆరోపణ
రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు దర్యాప్తు అనంతరం సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారని, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది సుధీర్‌కుమార్ ఆరోపించారు. రేవంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని.. కలుషితమైన నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చిందని, జ్వరం కూడా ఉందని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ రిమాండ్ ఖైదీకి ఇచ్చే కనీస సౌకర్యాలు కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. సిట్‌లో కాకుండా సౌకర్యాలున్న కార్యాలయంలో నిందితులను ఉంచాలని ఏసీబీని కోరినట్లు చెప్పారు. ఇక ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహల తరపు న్యాయవాదులు రవికుమార్, రాకేష్‌సింగ్ సైతం ఇవే ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా ఉదయం సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకొచ్చేటప్పుడు రేవంత్‌రెడ్డి మీడియాను చూస్తూ.. ‘ఈ కొడుకులు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు..’ అని అరవడం గమనార్హం.
రేవంత్ అనుమానాస్పద సంచారంపై ఆరా
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి అనుమానాస్పద సంచారంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీకి దొరికిపోవడానికి ముందు వారం రోజుల్లో మూడు సార్లు గన్‌మన్ లేకుండా రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లారు. ఆయన ఎక్కడికెళ్లారు, గన్‌మెన్లను ఎందుకు వద్దని వారించారు, ఎంతసేపు వెళ్లారు, ఆ సమయంలో గన్‌మెన్ ఎక్కడున్నారు.. తదితర వివరాలకు సంబంధించి గన్‌మెన్ల వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీంతోపాటు రేవంత్‌రెడ్డి అరెస్టుకు ముందు వారం రోజులకు సంబంధించిన కాల్ డేటాను ఏసీబీ విశ్లేషించింది. ఈ ఫోన్ సంభాషణలో దాదాపు 70 సార్లు చంద్రబాబు ప్రస్తావన ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. ఇక రేవంత్‌తోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహ ఫోన్లకు వచ్చిన కాల్స్‌పైనా అధికారులు ఆరా తీశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న దాదాపు 20 మంది కాల్‌డేటాను ఏసీబీ సేకరించింది.