తెలంగాణ సాధనలో ముఖ్యభూమిక నాదే: జైపాల్‌రెడ్డి
మహబూబ్‌నగర్: తెలంగాణ సాధనలో తాను ముఖ్యభూమిక పోషించానని కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా సోనియాగాంధీ పార్టీపరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. మహబూబ్‌నగర్ మండలం మాచన్‌పల్లిలో శనివారం మండల స్థాయి కాంగ్రెస్ సభ్యత్వాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ పదిసార్లు అధికారంలోకి వచ్చిందని, రెండు, మూడుసార్లు ఓడిపోయినంత మాత్రాన చింతించాల్సిన అవసరం లేదన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పార్టీ తోకచుక్క కాదని, రాజకీయ చరిత్రలో ధ్రువతారగా నిలిచిందని చెప్పారు. ప్రధాని మోదీ దేశంలో ఉండడం లేదని, ఇతర దేశాల్లో తిరుగుతూ హిందీలో ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కొత్త వాగ్దానాలను చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని దుయ్యబట్లారు. రైతులకు రూ.లక్ష మాఫీని ప్రకటించి. నాలుగు సంవత్సరాల్లో వాయిదాలుగా చెల్లిస్తే వడ్డీకి కూడా సరిపోదని అన్నారు. కరీంనగర్‌ను లండన్, న్యూయార్క్‌లను చేయడం, ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించడం వల్ల సామాన్య ప్రజలకు ఉపయోగమేమిటో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లాంటి తప్పుడు వాగ్దానాలు చేయలేదని అన్నారు.