కీసర, న్యూస్‌లైన్: శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు, ప్రజాదరణతో తాను విజయం సాధించినట్లు మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో ఆయన మండల పరిధి చీర్యాల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్‌ను స్వామివారికి అప్పగించినప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు.
దామోదర రాజనర్సింహ వంటి దిగ్గజాన్ని ఎదుర్కొన్నానని, ఫలితాలు వెలువడే ముందు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నానని చెప్పారు. శ్రీస్వామివారి ఆశీర్వాదంతోనే గెలుపొందానని, తన విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నానని పేర్కొన్నారు. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా శ్రీవారి ఆశీస్సులతో చేపట్టి విజయవంతంగా పూర్తిచేసి ప్రజల మన్ననలు పొందుతానని అన్నారు. అనంతరం ఆయన చీర్యాల నుంచి నేరుగా కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. కాగా, కంటోన్మెంట్ శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన సాయన్న చీర్యాల శ్రీవారి ఆశీస్సులతోనే విజయం సాధించినట్లు దేవాలయానికి సందేశం పంపారు.
లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం
Published Sat, May 17 2014 12:46 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM
Advertisement
Advertisement