ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు | III IT applications to be released today | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు

Published Tue, May 26 2015 2:34 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు - Sakshi

ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు

నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్జీయూకేటీ
బాసరలో వేరుగా, ఇడుపులపాయ, నూజివీడుల్లో వేరుగా ప్రవేశాలు
బాసరలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే.. మిగతా రెండింటిలో 85 శాతం సీట్లు ఏపీ వారికే

 
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని మూడు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. తెలంగాణలోని బాసర ట్రిపుల్‌ఐటీకి వేరుగా, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు కలిపి వేరుగా ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ సోమవారం నోటిఫికేషన్లు జారీ చేశారు. ఒక్కో ట్రిపుల్‌ఐటీలో 1000 సీట్ల చొప్పున 3వేల సీట్లను భర్తీ చేయనున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మంగళవారం నుంచి వచ్చే నెల 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలలల్లో టెన్త్ చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలిపి మెరిట్‌ను నిర్ధారిస్తారు.
 
 85 శాతం సీట్లు స్థానికులకే..
 రాష్ట్ర విభజన నేపథ్యంలో గతంలోలా (32:42:26 రేషియో) కాకుండా ఈసారి 371(డి) ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. అంటే బాసర ట్రిపుల్‌ఐటీలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. మిగతా 15 శాతం ఓపెన్‌కోటాలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు అవకాశమిస్తారు. ఇక ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ఐటీల్లో 85 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు.. మిగతా 15 శాతం చొప్పున ఓపెన్ కోటాలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లిం చాలి. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు, వార్షిక ఫీజులకు సంబంధించిన వివరాలను ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మార్గదర్శకాలను వేరుగా ఇస్తారు.
 
 ప్రవేశాల ప్రక్రియ వివరాలు..
 జూన్ 19: ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ
 జూలై 8: కౌన్సెలింగ్ కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన
 20న: స్పెషల్ కేటగిరీ కౌన్సెలింగ్ (తెలంగాణకు
 బాసరలో, ఏపీ వారికి నూజివీడులో)
 22, 23 తేదీల్లో: సాధారణ కౌన్సెలింగ్ (తెలంగాణ వారికి బాసరలో, ఏపీ వారికి నూజివీడులో)
 27న: మిగిలిన ఖాళీల భర్తీ కోసం వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి కౌన్సెలింగ్ (మూడు ట్రిపుల్ ఐటీల్లో)
 30న: ఓరియంటేషన్ తరగతులు
 ఆగస్టు 1: తరగతులు ప్రారంభం
 
 చైతన్యం కల్పిస్తున్నాం: వీసీ
 ట్రిపుల్‌ఐటీల్లో చేరిన తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లిష్ సరిగా రాని కారణంగా మనస్థాపానికి గురవడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి చేస్తున్న నేపథ్యంలో... వారిలో చైతన్యానికి కృషి చేస్తున్నామని ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. మొదటి ఏడాది నుంచే తప్పనిసరిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ పరిజ్ఞానం, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాలపై తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement