పౌరసేవల అమలులో మార్పు రావాలి
మంత్రి చందూలాల్ ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: పౌరసేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరులో మార్పు రావాలని రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆకాంక్షించారు. మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఎస్టీ, బీసీ శాఖల అధికారుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మం త్రులు చందూలాల్, జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ట్యాబ్ లు అందజేశారు. చందూలాల్ మాట్లాడుతూ గతంలో జిల్లాల విస్తీర్ణం, జనాభా అధికంగా ఉండడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిఘా, పర్యవేక్షణ కొరవడిందన్నారు.
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు ఆశించిన స్థాయిలో విజయవంతం అవుతాయని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించే బాధ్యత అధికారులదేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. కొత్తగా నియమితులైన జిల్లా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ,బీసీ శాఖల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్టీశాఖ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.