పోడు గోడు..
- జైలు పాలవుతున్న గిరిజనులు
- పట్టించుకోని పాలకులు
- ఆదివాసీలకు అందని అటవీహక్కు
అశ్వారావుపేట : ఆదివాసీలకు చిరునామాగా పేరొందిన జిల్లాలో ఆదివాసీలకు అటవీ హక్కులు అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్ర విభజనలో భాగంగా జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన ముంపు మండలాల్లో గిరిజనుల పోడు భూముల జోలికి అక్కడి అటవీ సిబ్బంది రాకపోవ డంలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే గిరిజనులపై కక్షసాధింపు చర్యకు పాల్పడుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల ఆకలి పోరు.. అటవీశాఖ అధికారుల ఉద్యోగ ధర్మం మధ్య జరుగుతున్న పోరు నానాటికీ ఉధృతమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అటవీభూముల్లో దశాబ్దాల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలపై కన్నెర్ర చేయడం గిరిపుత్రులకు శాపంగా పరిణమించింది.
అటవీహక్కుల చట్టం అమల్లోకి రాకమునుపే గిరిజనుల సాగుబడిలో ఉన్న పోడుభూముల వివరాలను సర్వే చేయకపోవడం.. సమగ్ర వివరాలను అప్పటి అధికారులు పొందుపరచకపోవడం ఆయా ప్రాంతాల గిరిజనుల ఉనికిని దెబ్బతీస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో జీవించలేక.. తరతరాలుగా అడవితల్లిని నమ్ముకుంటూ.. పోడు నరుక్కుంటూ జీవిస్తున్న అడవి బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు నోటికాడ కూడు లాగేసినట్టయ్యాయి. జిల్లాలోని ప్రతి ఏజెన్సీ గ్రామంలో పోడు భూముల సమస్యలు దాదాపు 5లక్షల ఎకరాల్లో ఉన్నా.. పరిష్కరించేందుకు పాలకపక్షం దర్బార్‌ను నిర్వహించేందుకు ముందుకు రావట్లేదు.
అడుగడుగునా కేసులే..
తాతాల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూమిలో కాలు పెట్టినా కేసే.. ఫారెస్టు వారిని అడ్డగించినా కేసే.. ఫారెస్టు సిబ్బంది నాటిని మొక్కలు పీకేసినా కేసేనంటూ అడుగడుగునా ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తూ పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అడవిబిడ్డలు ఆవేదన చెందుతున్నారు. అటవీభూముల చుట్టూ కందకాల తవ్వకం పేరుతో అటవీశాఖ పోడుభూముల జోలికి రావడంతో ఆదివాసీలు ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లందు, భద్రాచలం, పినపాక గిరిజన నియోజకవర్గాల్లో దాదాపు 5 లక్షల ఎకరాలలో గిరిజనులు అటవీభూములను పోడు చేసుకుని జీవిస్తున్నారు. కాగా కందకాలు తవ్వేందుకు వచ్చిన అటవీసిబ్బందిని అడ్డుకున్న పోడు దారులపై కేసులు నమోదు చేశారు. కందకం తవ్వాక ఎవరి భూమిలో వారు సాగు చేసుకోవచ్చని చెప్పి అటవీశాఖ అధికారులు వారి పని ముగించేసుకున్నారు.
కానీ గిరిజనులు నాటే పత్తిచేలను తొలగించడం..దుక్కి దున్ననీయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఏదశలో గిరిజ నులు నోరు మెదిపినా.. అటవీశాఖ అధికారుల కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని వెంటనే పోలీస్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. గిరిజనుల పోడు భూములకు రక్షణ ఏప్రభుత్వ శాఖ కల్పిస్తుందో అర్థం కావడంలేద ంటున్నారు. భూముల వద్ద ఘర్షణలు జరిగితే కేసులు కూడా చాలా ఆలస్యంగా నమోదయ్యేవి. అలాంటిదిప్పుడు ప్రభుత్వ ప్రోద్భలంతోనే పోలీసులను వెంటబెట్టుకుని ఫారెస్టు సిబ్బంది పోడుభూముల వద్దకు వెళుతున్నారు. ఈక్రమంలోనే అశ్వారావుపేట మండలం ఊట్లపల్లికి చెందిన 29మంది పోడుదారులను ఆదివారం అశ్వారావుపేట పోలీసులు రిమాండ్ చేశారు. ఇదే తంతు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.
పట్టించుకోని పాలకులు
ఆదివాసీల పోడుభూముల సమస్య వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సీపీకి తప్ప ఏ రాజకీయ పార్టీకి పట్టినట్టు లేదు. జిలాలో సీపీఐ (ఎన్‌డీ న్యూడెమొక్రసీ), సీపీఎం, సీపీఐలు కూడా వారికి ప్రాభల్యం ఉన్న గ్రామాల్లో గిరిజనుల హక్కుల కోసం ప్రత్యక్షంగా పోరాడుతూనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి హామీ మేరకు అర్హులైన గిరిజనులందరికీ అటవీహక్కు పత్రాలు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. కానీ పాలక పక్షానికి , ప్రతిపక్షాలకు గిరిజనుల గోడుమాత్రం పట్టకపోవడం బాధాకరం. ఏజెన్సీ నియోజకవర్గం అయినా గిరిజనులకు అన్యాయమే జరుగుతుందని పలుమార్లు ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వమే స్పందించి ఆదివాసీలపై వివక్షణను వీడి పోడు భూములపై హక్కులు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.