మరణంలోనూ తోడుగానే..
- ఒకేరోజు భార్యాభర్తల మృతి
- మల్కాజిగిరిలో విషాదం
గౌతంనగర్: ‘నాతి చరామి’ అన్న పదానికి వారు అర్థమై నిలిచారు. మూడు ముళ్ల బంధంతో మొదలైన వారి ప్రయాణం... మరణశయ్య వరకూ కలిసే సాగింది. ఏడడుగులు నడిచి... ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలను కలసి పంచుకున్న ఆ జంట చివరి అడుగునూ కలిసే వేశారు. అందరినీ కన్నీటి సంద్రంలో ముంచి సుదూర తీరాలకు సాగిపోయారు. మల్కాజిగిరిలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలివీ... స్థానిక హనుమాన్‌పేట్‌కు చెందిన దక్షి ణామూర్తి (86), కమలా మూర్తి (82) భార్యాభర్తలు.
దక్షిణామూర్తి ప్రముఖ కళాకారుడు, చిత్రలేఖనంలో సిద్ధ హస్తుడు. దక్షిణ మధ్య రైల్వేలో పనిచేసి, పదవీ విరమణ చేశారాయన.అనంతరం రైల్వే బాలల పాఠశాల, మహబూబియా కళాశాలల్లో కొన్నాళ్లు ఉపాధ్యాయునిగా సేవలందించారు. కమలా మూర్తినాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుండడంతోఆస్పత్రిలో చేర్పించారు. భార్య ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి భర్త దక్షిణామూర్తి మనోవేదనతో అన్నపానీయాలు మానేశారు.
ఆమెపై దిగులుతో కుంగిపోయిన ఆయన...చివరకు శుక్రవారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. భర్త ఇక లేడన్న నిజాన్ని కమలామూర్తి తట్టుకోలేకపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. వీరి మరణ వార్త తెలుసుకున్న చిన్న నాటి స్నేహితులు, బంధువులు ఘనంగా నివాళులర్పించారు.