జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ సమీకృత భవనాలు
సాక్షి, ఆసిఫాబాద్: దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఆవిర్భావించి ఈ దసరాతో మూడేళ్లు కావస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలను వేరు చేస్తూ పోరాటయోధుడు కుమురం భీం పేరు మీదుగా కొత్త జిలాను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతవాసులకు కొత్త జిల్లా ఏర్పాటుతో పాలన మరింత చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయినా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో మాత్రం బీజం పడింది.
కుమురం భీం జిల్లా ఆవిర్భావించడంతో ప్ర ధానంగా దూర భా రం సమస్య తీరినట్లయింది. మారుమూల ప్రాంతమైన బెజ్జూరు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఒక రోజు ముందు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా ఏర్పాటుతో ఈ తిప్పలు తప్పాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చిట్టచివరి ప్రాంతాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం రెండు నియోజవర్గాలతో కలెక్టర్, ఎస్పీ నేరుగా మారుమూల ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పర్యవేక్షణ పెరిగింది.
ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం..
కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికులకే ఉద్యోగాల్లో 90 శాతం అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జిల్లాలో జరిగిన కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఇతర వివిధ శాఖల్లో తాత్కాలిక పోస్టుల్లోనూ జిల్లాలో స్థానిక నిరుద్యోగ యువతకే అవకాశం కలిగింది. ఇక జిల్లా ఏర్పాటుతో భవిష్యత్‌లోనూ స్థానిక నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగనుంది.
అభివృద్ధికి అడుగులు..
కొత్త జిల్లా ఏర్పాటుతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా లింగాపూర్, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట మూడు మండలాలు ఏర్పడ్డాయి. చిన్న మండలాలతో పాలన మరింత సులభమవుతోంది. అలాగే కొత్తగా తహసీల్, ఎంపీడీవో, పోలీసు స్టేషన్, తదితర మండల కార్యాలయాలన్నీ రావడంతో పాలనలో ఫోకస్ పెరిగింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమీకృత భవనాల నిర్మాణాలు, పోలీసు కార్యాలయాల నిర్మాణాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రం కావడంతో ప్రతి శాఖకు సంబందించిన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వైద్య సేవల్లో సామాజిక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడం, మహిళల భద్రత కోస సఖీ కేంద్రం తదితర శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. పరిపాలనపై మరింత పట్టు పెరిగింది. సొంత జిల్లాల్లోనే బదిలీలకు ఆస్కారమేర్పడింది. కేంద్రం కొత్త జిల్లాల ప్రతిపాదికనే ఇటీవల నిధులు మంజూరుకు సుముఖం తెలపడంతో ఇక నుంచి మరింత ప్రగతి ఆశించవచ్చు.
అరకొర వసతులు..
గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు, కార్యాలయాలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో అధికారులకు సరైన మౌలిక వసతులు లేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడిన నుంచి అరకొర సిబ్బందితోనే పాలన సాగుతోంది. ఇప్పటికీ అన్ని శాఖల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులకు జిల్లా కేంద్రంలో ఆవాస యోగ్యం లేకపోవడంతో కాగజ్‌నగర్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ హెచ్‌ఆర్‌ఏ తక్కువగా ఉండడంతో కొందరు ఉద్యోగులు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్తున్నారు. ప్రధానంగా గడిచిన మూడేళ్లలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. డీఎంహెచ్‌వో కార్యాలయంతో పాటు చాలా వరకూ కార్యాలయాలు ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్డు డివైడర్లు నిర్మించారు. ఏజెన్సీలో నేటికీ అనేక గ్రామాలకు సరైన రోడ్డు వసతి లేదు. పలు సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటుతో ఎంతో మేలు జరిగినట్లయిందని ప్రజలు తెలుపుతున్నారు.
విద్యా వ్యవస్థ మెరుగుపడాలి
కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లాకు కొన్ని గురుకులాలు మంజూరయ్యాయి. ఇది స్వాగతించాల్సిన విషయమే అయినా జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో ప్ర భుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు ఏర్పా టు చేయాలి. గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
– దుర్గం రవీందర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు
నూతన జిల్లాగా ఏర్పడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు దూరభారంతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం దూరభారం తగ్గినా చాలా వరకూ పనులు జరగడం లేదు. కాగజ్‌నగర్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేసినా గతంలో ఉన్న పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు.
– సిందం శ్రీనివాస్, కాగజ్‌నగర్
పరిపాలన సౌలభ్యం పెరిగింది
కుమురం భీం జిల్లా ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వ శాఖలు, అధికారులు అందుబాటులోకి వచ్చారు. గతంలో ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలా వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చేంది. కాని కుమురం భీం జిల్లా ఏర్పాటుతో చాలా వరకూ పరిస్థితి మారింది. శాఖల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ సైతం పెరిగింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
– బొమ్మినేని శ్రీధర్, రెబ్బెన
అభివృద్ధికి బాటలు పడ్డాయి..
నూతనంగా జిల్లా, మండలాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడ్డాయి. గతంలో జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో ఇబ్బందులకు గురయ్యాం. నూతన మండలాల ఏర్పాటుతో రవాణా ఇబ్బందులు తీరాయి. పరిపాలన సౌలభ్యంగా మారింది. ప్రభుత్వపరమైన పథకాలు, కార్యక్రమాల సమాచారం తెలుసుకుకోవడం నూతన మండలాలతో అందుబాటులోకి వచ్చింది.
– సయ్యద్ అజీమ్, చింతలమానెపల్లి
సేవలు అందుబాటులోకి
చింతలమానెపల్లి మండలంగా ఏర్పడక ముందు గూడెం, డబ్బా, ఖర్జెల్లి, దిందా, అడెపల్లి, కేతిని, రుద్రాపూర్ గ్రామాలకు వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేంది. చింతలమానెపల్లి కొత్త మండలంగా ఏర్పాటు కావడంతో చాలా వరకూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరనే ఉన్నాయి. నూతన పంచాయతీలతో సౌలభ్యంగా ఉంది. మండల కేంద్రంలో అన్ని కార్యాలయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన సేవలందించాలి.
– కుమ్మరి హరీశ్, చింతలమానెపల్లి
Comments
Please login to add a commentAdd a comment