
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి క్రేజ్ పెరుగుతోంది. పథకం కింద పరిమిత సంఖ్యలో ప్రభుత్వం లబ్ధి కలిగిస్తుండగా.. దరఖాస్తుల సంఖ్య మాత్రం విపరీతంగా ఉంది. 2016 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా.. తొలి రెండేళ్లలో 300 దర ఖాస్తులు రాకపోగా.. ప్రస్తుతం కోటాకు మించి పదింతలు దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దరఖాస్తుల పరిశీలన, వడపోత కత్తిమీద సాములా మారుతోంది. ఎంజేపీ ఓవర్సీస్ విద్యానిధి కింద ప్రతి ఏడాది 300 మందికి అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఈబీసీలకు 5 శాతం కేటాయిస్తుండగా.. మిగతా 95 శాతాన్ని ప్రాధాన్యత క్రమంలో బీసీలోని కేటగిరీల వారీగా అవకాశం ఇస్తున్నారు. ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఇటీవల దరఖాస్తులు స్వీకరణకు ఉపక్రమించగా.. 3,116 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో పోటీ 1:10గా మారింది. అనూహ్యంగా దరఖాస్తులు పెరగడంతో అవాక్కయిన అధికారులు.. వీటి పరిశీలనకు దాదాపు నెలన్నర సమయం తీసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన బీసీ సంక్షేమ శాఖ అక్టోబర్ 31న అర్హుల జాబితాను ప్రకటించింది.
కోటా పెంచితే మేలే...
ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అన్ని సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరిట అమలు చేస్తుండగా.. బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా సీఎం ఓవర్సీస్ విద్యా నిధిగా అమలు చేస్తున్నారు. కాగా బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికైన లబ్ధిదారు విదేశాల్లో పీజీ కోర్సు చేసేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దీన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిబంధనలకు అనుగుణంగా లబ్ధి చేకూరుస్తుండగా.. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మాత్రం అత్తెసరు సంఖ్యలోనే లబ్ధి కలుగుతోంది. దీంతో కోటా పెంచితే మేలు జరుగుతుందని భావిస్తున్న అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు, లబ్ధి, ఏటా బీసీ సామాజిక వర్గం నుంచి ఎంతమంది విదేశీ విద్య కోసం వెళ్తున్నారనే అంశాలపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వీటి ఆధారంగా ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.