మంత్రి కె.తారకరామారావుతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. చిత్రంలో జయేశ్ రంజన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను ఆదర్శంగా తీసుకుని ఢిల్లీలో కూడా త్వరలో ఒక ఇంక్యుబేటర్‌ను ఏర్పా టు చేస్తామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తమతో టీ–హబ్ అనుభవాలు పంచుకోవాలని కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఆయనకు వివరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఐటీ పరిశ్రమలో నెలకొని ఉన్న అనిశ్చితిని తొలగించి పరిశ్రమకు కొత్తఊపు తీసుకొచ్చేందుకు టీ–హబ్ పేరుతో ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.
టీ–హబ్‌లో భాగస్వాములు అయ్యేందుకు తెలంగాణ వారికే కాకుండా ఇతర రాష్ట్రాల వారికీ అవకాశం కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి టీ–హబ్ మంచిపేరు తీసుకొచ్చిందని, దీంతో నగరంలో స్టార్టప్ పరిశ్రమల ఏర్పాటు పెరిగిందని తెలిపారు. ఫలితంగా యువత ఆశలకు గొప్ప ఆలంబన దొరికిందన్నారు. టీ–హబ్ గురించి తాము విన్నామని, అందుకే పరిశీలించడానికి వచ్చామ ని సిసోడియా అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఐటీ తదితర రంగాల్లో ప్రగతి సాధించిందని ప్రశంసించారు. ఢిల్లీ లోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశ్రమల వర్గాలను ఇంక్యుబేటర్ ఏర్పాటులో భాగస్వాములు చేసుకోవాలని కేటీఆర్ సూచిం చారు. గేమింగ్, యానిమేషన్, డేటా అనా లిటిక్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలకు సం బంధించి ప్రత్యేకంగా రూపొందించిన విధానాలను కేటీఆర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
టెక్నాలజీని అందిపుచ్చుకున్నతెలంగాణ: సిసోడియా
తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కితాబిచ్చారు. అనంతరం టీ–హబ్ సందర్శనకు వెళుతూ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో సిసోడియా ముచ్చడించారు. తెలంగాణ ఏర్పాటు చేసిన టీ–హబ్ అద్భుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తామని, తెలంగాణ సహకారం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పటికీ అభివృద్ధి చెందుతోందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. ‘హైదరాబాద్ వాతావరణం బాగుంది. ఢిల్లీలో ఆకాశాన్ని చూసే అవకాశం లేదు. ఇక్కడ ఆ అవకాశం కలిగింది. రాజకీయాల్లో ఆప్, టీఆర్‌ఎస్ కలసి పనిచేసే విషయాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్తాం’ అని సిసోడియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment