‘శాయ్’.. బాబోయ్!
- స్టేడియం నిండా సమస్యలే..
- గుంతలమయంగా రన్నింగ్ ట్రాక్
- ఎటు చూసినా పిచ్చిమొక్కలే దర్శనం
- పాములకు ఆవాసం..
- నడక కోసం వస్తే నరకయాతన
- క్రీడాకారులకు తప్పని తిప్పలు
- టాయిలెట్స్ సైతం లేని దుస్థితి
- ఇటువైపు దృష్టి సారించని అధికారులు
మెదక్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెదక్ పట్టణం ముఖద్వారంలో 2000 సంవత్సరంలో ఇందిర ప్రియదర్శిని స్టేడియం ఏర్పాటు చేశారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో.. 400 మీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రన్నింగ్ ట్రాక్ సమీప జిల్లాల్లో ఎక్కడాలేదు. అప్పట్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఇక్కడ అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్నారు. సుమారు 50 సీట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం 30 మంది క్రీడాకారులు మాత్రమే శిక్షణ పొందుతున్నారు. గతంలో బాక్సింగ్, ఉమెన్స్ కబడ్డీ అకాడమీ ఉండగా వాటిని ఎత్తేశారు. రన్నింగ్‌లో ఇక్కడ శిక్షణ పొందిన మెరికల్లాంటి చిరుతలు జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో ఉత్తమ బహుమతులు అందుకున్నారు.
కనీస సౌకర్యాలు కరువు:
లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన స్టేడియంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. టాయిలెట్లు శిథిలం కావడంతో మసక చీకట్లోనే క్రీడాకారులంతా కాలకృత్యాల కోసం ఆరుబయటకు వెళ్తుంటారు. బాత్రూంలు సక్రమంగా లేకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. స్టేడియంలో పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోయి పాములకు ఆవాసంగా మారింది. దీంతో మసక చీకట్లో స్టేడియంకు వచ్చే క్రీడాకారులు, పట్టణ వాకర్స్ బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్నారు. రన్నింగ్ ట్రాక్ గుంతలమయం కావడంతో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతుంది. దీంతో పలువురు అథ్లెట్లు కిందపడి గాయాల పాలవుతున్నారు.
హైజంప్, లాంగ్ జంప్‌ల కోసం ఏర్పాట్లు లేకపోవడంతో నేలపై ఇసుక పోసుకొని ఉద్యోగార్థులు నానా పాట్లు పడుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్టేడియం మధ్యలో ఒక్క లైట్ కూడా లేక చీకట్లోనే పట్టణ ప్రజలు వాకింగ్ చేస్తున్నారు. అటు స్పోర్ట్ ఆథార్టీ ఆఫ్ ఇండియా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, మున్సిపాలిటీ గానీ పట్టించుకోకపోవడంతో భారీ స్టేడియం సమస్యలకు నిలయంగా మారింది. ఈ విషయమై స్టేడియం కోచ్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా సెప్టిక్ ట్యాంకు కూలిపోవడం వల్లే మరుగుదొడ్లు పనికి రాకుండా పోయాయన్నారు. ప్రత్యామ్నాయంగా రింగులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో టాయిలెట్లు పునరుద్ధరిస్తామని తెలిపారు.
సింథటిక్ ట్రాక్ వేయాలి
స్టేడియంలో 400 మీటర్ల ట్రాక్ ఉన్నప్పటికీ పూర్తిగా శిథిలమై రన్నింగ్‌కు అనుకూలంగా లేదు. గుంతలమయంగా మారిన ట్రాక్‌పై పరుగులు పెట్టడం ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. ఎస్‌ఐ, కానిస్టేబుల్స్, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రాక్టీస్ చేసేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
- ఆనందం. రిటైర్డ్ పీడీ
ఉపాధి హామీ నిధులతో
పిచ్చిమొక్కలు తొలగించాలి
ఉపాధి హామీ పనులతో స్టేడియంలో పెరిగిపోయిన పిచ్చిమొక్కలు తొలగించాలి. ట్రాక్ ఇరువైపుల ఉన్న పగుళ్లలో మట్టి పోయించాలి. మున్సిపాలిటీ అధికారులు స్పందించాలి.
-కృష్ణ, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి